Saturday, January 28, 2023
More
  Homelatestఅంగ‌రంగ‌ వైభ‌వంగా కొత్తకొండ జాతర

  అంగ‌రంగ‌ వైభ‌వంగా కొత్తకొండ జాతర

  • వీరభద్రుడి కళ్యాణంతో ఆరంభ‌మైన బ్రహ్మోత్సవాలు
  • సంక్రాంతి సందర్భంగా చూడ‌ముచ్చ‌ట‌గా బండ్లు తిరగడం
  • కోరమీసాలు, ప్రభలు, కోడె మొక్కులు

  విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: కొత్తకొండలోని వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల జాతర కన్నుల పండుగగా సాగుతూ ఉంది. భక్తి పారవశ్యంతో జాతర ఓలలాడుతోంది. తమ ఇలవేల్పు, ఇష్ట దైవం వీరభద్రుడికి భ‌క్తులు మొక్కులు సమర్పించి, పూజాధికాలు చేస్తున్నారు.

  వేల సంఖ్యలో హాజరైన భక్త జనంతో కొత్తకొండ ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుంది. శనివారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో జాతరకు హాజరయ్యారు. ఆదివారం బండ్లు తిరగడంతో మరింత జోరుతో జాతర సాగనున్నది.

  ఉత్తర తెలంగాణలో ప్రసిద్ది గాంచిన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలవైన వీరభద్రుడి జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల 10న భద్ర‌కాళీ సమేతా వీరభధ్రుడి కళ్యాణంతో అధికారికంగా ప్రారంభమయ్యాయి.

  ఈ ఉత్సవాలకు ఐదు లక్షలకు పైగా భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర నుండి వస్తారు. ఇప్పటికే లక్షలాదిమంది హాజరయ్యారు. ఈనెల 10న వీరభద్రుడి కళ్యాణంతో ప్రారంభమై 18న అగ్నిగుండాలు వరకు స్వామి పర్యటన జరుగనున్నది.

  రేపు ఎడ్లబండ్లు తిరుగుట

  మకర సంక్రాంతి రోజున భద్ర‌కాళీ సమేతా వీరభధ్రుడి సర్వాలంకార నిజరూపాన్ని ద‌ర్శిస్తే సర్వపీడల నుండి విముక్తి క‌లుగుతుంద‌ని శాస్త్రోక్తి. శనివారం భోగి పండుగ సందర్భంగామొక్కులు సమర్పించారు. మకర సంక్రాంతి ఆదివారం తెల్లవారు జామున అనగా ఉత్తరాయణ పుణ్యకాలమందు వందలాది ఎడ్లబండ్లతో రథయాత్ర జరుగనున్నది. మొదట కుమ్మరుల బండ్లతో వీరభోనంతోనే జాతర ఊగిపోతుంది.

  కొత్తకొండ స్థల పురాణం

  కాకతీయ రుద్రేశ్వరుల కాలం కీ.శ. 1600 ప్రాంతాన మల్లిఖార్జున పండితుని మనవడు కేదారి పండితునిచే శైవాగమానుసారముగా ప్రతిష్టించినట్లు చ‌రిత్ర చెప్తుంది. మొదట సమీప కొండపై స్వామి వారు దక్షయాగం తదనంతరం తపోవనార్ధం స్వామి వారు కొండపై వెలిసారని ప్రశస్థి.

  స్వామి వారి ఆలయం చుట్టూ సప్తగుండాలు(ఏడు కోనేర్లు)వెలిశాయని చరిత్ర చెపుతుంది. కీ.శ.1600 ప్రాంతంలో కొంత మంది కుమ్మరులు కొండపైకి ఎడ్లబండ్లు కట్టుకొని వారికి కావలసిన కర్రలకై కొండ ఎక్కారు. వారికి కావలసిన కలప తీసుకొని తిరిగి వెళ్లేందుకు సిద్దమవుతూ ఎడ్ల కోసం చూడగా ఎంతకు కనిపించకపోవడంతో అలసి కొండపైనే నిద్రకు ఉపక్రమించారు.

  స్వామి వారు స్వప్నంలో కనిపించి నన్నీకొండపై నుండి దించి క్రిందనున్న ఆలయంలో ప్రతిష్టించమని ఆజ్ఞాపించెను. దీనితో మల్లిఖార్జుని పండితుని మనుమడు కేదారి పండితునిచే కొండపై నుండి దింపి క్రింద ఉన్న ఆలయంలో ప్రతిష్టించారు.

  ఇరుకైన జాతర పరిసరాలు

  జాతరకు జాగ తగ్గిపోయింది. గుడి చుట్టూ దేవుడి మాన్యాన్ని కాపాడేవారు లేక భూమి అన్యాక్రాకంతమై భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమ అనుమతులతో వివిధ నిర్మాణాలు చేపట్టారు. దీనితో జాతర బండ్లు తిరిగేటప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరీంనగర్​ ఎంపిగా బండి సంజయ్​ ప్రసాదు పథకం వర్తించేందుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular