విధాత: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డైలాగులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) గుర్తు చేస్తూ నవ్వులు పూయించారు. రాజేంద్ర నగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), మల్లారెడ్డి (Malla Reddy) హాజరయ్యారు.
అయితే కేటీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. వేదికపై ఉన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజంగా చెప్పాలంటే మా అందరి కంటే అతను యువకుడు. ఆ మాట కేటీఆర్ అనేసరికి మల్లారెడ్డి దండం పెట్టిండు. వెంటనే కేటీఆర్ కల్పించుకుని ఇంకా పూర్తే కాలేదు.. దండం పెట్టేసిండు.
మా అందరి కంటే ఎక్కువ జోష్, ఉత్సాహం ఉన్న నేత. వయసులో నా కంటే 30 ఏండ్లు పెద్ద.. కానీ ఆయన వయసు తెల్వదు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో అంతా ఆయనదే నడుస్తోంది. ఎక్కడ పోయినా కూడా.. ఆయనదే హవా. కష్టపడ్డా.. అవన్నీ మీరు కూడా చూసి ఉంటారు.. నేను కూడా చూసి ఉన్నాను అని మల్లారెడ్డి డైలాగ్‌ను కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా సభలో నవ్వులు పూశాయి.