HomelatestKTR | పచ్చని పంటల తెలంగాణ కావాలా.. నెత్తురు మంటల తెలంగాణ కావాలా..

KTR | పచ్చని పంటల తెలంగాణ కావాలా.. నెత్తురు మంటల తెలంగాణ కావాలా..

KTR

  • బిజెపి దిగజారుడు రాజకీయం
  • దాస్యం వినయ్‌కు మళ్లీ టికెట్
  • విభజన హామీల పట్ల బీజేపీ నిర్లక్ష్యం
  • దోస్త్ కు దోచిపెడుతున్న మోడీ
  • వరంగల్ కు ఉజ్వల భవిష్యత్తు
  • రాష్ట్ర మంత్రి కేటీఆర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పచ్చని పంటల తెలంగాణ కావాల్నా? నెత్తురు మంటల తెలంగాణ కావాల్నా? ప్రజలు తేల్చుకోవాలంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నెత్తురుపారే తెలంగాణ కావాలా? నీళ్లు పారే తెలంగాణ కావాలా? ఆలోచించాలని ఆయన ఉద్భోదించారు. ఈ గడ్డమీద కారణమేదైనా… నక్సలైట్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు నెత్తురు పారిందని అలాంటి నేలమీద ఇప్పుడు నీళ్లు పారుతున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు.

 

కాజీపేటలో శుక్రవారం రాష్ట్ర చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

మతం పేరుతో, కులం పేరుతో కొట్లాటలు పెట్టి ప్రజల మధ్య విద్వేషం రగిలించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీల పేరుతో నిరుద్యోగ మార్చ్‌ పేరుతో కొట్టుక చావాలని కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఈ ఓరుగల్లు గడ్డ కవులు, కళాకారులకు, చైతన్యవంతులకు పెట్టింది పేరని అలాంటి కుట్రలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

పశ్చిమ టికెట్ వినయ్ భాస్కర్ కే

వినయ్ భాస్కర్‌కు గతంలో 37 వేల మెజారిటీ లభించిందనీ, రానున్న ఎన్నికల్లో 70 వేల మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా వరంగల్ పశ్చిమ టికెట్ పై అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ మాటలతో వీటన్నింటికీ తెరదించారు. వచ్చే ఎన్నికల్లో వినయ్ భాస్కర్ ను 70 వేల మెజారిటీతో గెలిపించాలని చెప్పడం అంటేనే టికెట్ గ్యారెంటీ అని చెప్పకుండానే కేటీఆర్ చెప్పారు.

బిజెపి దిగజారుడు రాజకీయం

పనుల్లో పోటీ పడకుండా కేంద్రంలోని బిజెపి నాయకులు నీచమైన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పని చేస్తే కేంద్ర ప్రభుత్వం రెండు పనులు చేసి ప్రజలను గెలుచుకోవాలి.. కానీ, కుట్రలు చేసి ప్రజలను విడదీయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇటీవల పేపర్ లీకేజీ వెనక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సలహా సూచనలు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే కుట్రలను బహిర్గతం చేయడంతో లీకేజీలు ఆగిపోయాయని వివరించారు.

ఇంతకాలం పట్టించుకోని కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎన్నికలవేళ ప్రజలను మభ్య పెట్టేందుకు రకరకాల మాటలు చెబుతున్నారని విమర్శించారు.

విభజన హామీల అమలుపట్ల నిర్లక్ష్యం

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తదితర హామీలను అమలు చేయకుండా బిజెపి నాయకులు రకరకాల కారణాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా గుజరాత్ లో మాత్రం 20వేల కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే బిజెపి నాయకులు వరంగల్ కు ఏ పనులు చేశారో చెప్పాలని నిలదీశారు.

మోడీ సర్కార్ తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ గాని, పరిశ్రమ గాని, అభివృద్ధి గాని చేయలేదంటూ విమర్శించారు. తెలంగాణకు పైసా పని చేయలేదని రెచ్చగొట్టే విధానాలతో అశాంతి చెలరేగే విధంగా బిజెపి ప్రయత్నిస్తుందని విమర్శించారు.

దోస్త్ కు దోచిపెడుతున్న మోడీ

దేశాన్ని దోయాలి. దోస్తుకు దోచిపెట్టాలి. దోస్తు ఇచ్చే చందాలతో దందాలు చేసి విపక్షాల ప్రభుత్వాలను పడగొట్టి దేశంలో నియంతృత్వం తీసుకురావాలనేదే మోడీ లక్ష్యం అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగ మార్చ్ చేసిన బిజెపి నాయకులు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని వీటి గురించి మాత్రం మాట్లాడడం లేదంటూ విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులు నిరుద్యోగ మార్చ్ నిర్వహించారని హేళన చేశారు.

జన్‌ధ‌న్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని నోట్ల రద్దుతో టెర్రరిజం, హవాల రూపుమాపుతామని మాటలు చెప్పిన ప్రధానమంత్రి 15 లక్షల కోట్ల నోట్లకు బదులు ఇప్పుడు 31 లక్షల కోట్లకు చేరాయని ఎద్దేవా చేశారు.

వరంగల్ కు ఉజ్వల భవిష్యత్తు

వరంగల్ కు రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. 10016 కోట్ల రూపాయలతో 24 అంతస్తుల్లో అతిపెద్ద హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వచ్చాయని, ఈరోజు నాలుగు కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, రానున్న రోజుల్లో వరంగల్ మణిహారంగా మారుతుందని అన్నారు. ఈ నగరాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించినట్టు వివరించారు. హైదరాబాదుకు అనుబంధంగా వరంగల్ పురోభివృద్ధి చెందుతుందన్నారు.

అడ్డంకులు ఆటుపోట్లు అధిగమించి..

అనేక ఆటుపోట్లు కుట్రలు అవరోధాల మధ్య మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సేవే లక్ష్యంగా కొనసాగుతున్నట్లు రాష్ట్ర చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వివరించారు. తన ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటానని, అనేకమంది ఆత్మీయులు, సన్నిహితుల సహకారంతో తానీ స్థాయికి చేరినట్లు వివరించారు.

ఈ బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎంపీలు దయాకర్, కవిత ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, కౌశిక్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, డాక్టర్ రాజయ్య, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular