విధాత: కేసీఆర్ రాక్షస పాలనకు ఒక నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో నవీన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసీఆర్‌పై హత్యానేరం కింద కేసు పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలన్నారు.
నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ అబద్ధం చెప్పినా రెండు సార్లు అధికారం ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యను సీఎం పరిష్కరించడం లేదు. రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులేనని, బీఆర్‌ఎస్ పైరవీ కారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయని ఆయన ఆరోపించారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ కారణం కేటీఆర్ అని ఆరోపించారు. ఆయనను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు? అని ప్రశ్నించారు. లీకేజీ ఘటనపై ఈ నెల 22న గవర్నర్‌ను కలుస్తామన్నారు.