KTR | కాంగ్రెస్ పక్షాన నిలుద్దామా? KCRకు మద్ధతిద్దామా?: మంత్రి కేటీఆర్
KTR జనాన్ని గోస పెట్టిన కాంగ్రెస్ సమస్యలు తీర్చని సన్నాసులు చత్తీస్‌గడ్‌లో ఎందుకు చేయడం లేదు వరంగల్ జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫైర్ ఎన్నికల సభగా మార్చిన కేటీఆర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆరున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని సన్నాసులు, దద్దమ్మలైన కాంగ్రెస్ పక్షాన ఉందామా? 9 ఏండ్ల కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించిన కేసీఆర్ పక్షాన ఉందామా? అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ […]

KTR
- జనాన్ని గోస పెట్టిన కాంగ్రెస్
- సమస్యలు తీర్చని సన్నాసులు
- చత్తీస్‌గడ్‌లో ఎందుకు చేయడం లేదు
- వరంగల్ జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫైర్
- ఎన్నికల సభగా మార్చిన కేటీఆర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆరున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని సన్నాసులు, దద్దమ్మలైన కాంగ్రెస్ పక్షాన ఉందామా? 9 ఏండ్ల కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించిన కేసీఆర్ పక్షాన ఉందామా? అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్)ప్రశ్నించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ములుగు జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బస్ స్టేషన్, ఆధునిక పోలీస్ స్టేషన్ ల తో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్ హయాంలో గోసపడ లేదా?
అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమైక్య ప్రభుత్వంలో, కాంగ్రెస్ హయాంలో 65 ఏళ్లు గోషపడ్డది అప్పుడే మరిచిపోయారా? అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీళ్లు ఇవ్వకుండా, సాగునీళ్ళు ఇవ్వకుండా చేసింది ఈ కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ సన్నాసులు, దద్దమ్మలు
ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు గంగిరెద్దుల వాళ్ల మాదిరి రకరకాల వేషాలతో వస్తున్నారని మంత్రి విమర్శించారు. 75 ఏళ్ల స్వతంత్రంలో కాంగ్రెస్ సన్నాసులు, దద్దమ్మలు కరెంటు ఇవ్వకుండా వ్యవహరించారని, వారిని ఇంకా నమ్ముదామా? అంటూ ప్రశ్నించారు. ఎన్నడూ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కుంటి గుర్రాల పండ్లు తోముతూ, తమ సొంత లాభం చూసుకున్న దిక్కుమాలిన కాంగ్రెస్ను ఇంకా పట్టించుకోవడం అనవసరమా అంటూ నిలదీశారు.
రకరకాల వేషాలు, కొత్త కొత్త ముఖాలతో వచ్చే కాంగ్రెస్ నాయకులను చూసి ఆగం కావద్దని హితవు పలికారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినా ములుగులో ఈసారి కెసిఆర్ పక్షం వహించాలని ప్రజలను కోరారు.
కోటిన్నర ఎకరాల మాగాణం
కోటి రతనాల వీణ అని దాశరథి చెబితే కోటిన్నర ఎకరాల మాగాణం చేసిన ఘనత కేసిఆర్ ది అంటూ మంత్రి కేటీఆర్ కొనియాడారు. కెసిఆర్ వల్ల ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దూకుతున్నాయని అభివర్ణించారు.
చత్తీస్ గడ్ లో ఎందుకు చేయడం లేదు
పక్క రాష్ట్రం చత్తీస్‌ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ధాన్యం కొనుగోలుకు కనీస మద్దతు ధర చెల్లించడం లేదని కేటీఆర్ విమర్శించారు. పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మాత్రం ఎగిరి పడుతున్నారని విమర్శించారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు ఇవ్వని మొఖాలు తెలంగాణలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా 24 గంటల ఉచిత కరెంటు అమలు కావడం లేదన్నారు.
తండాలు గ్రామపంచాయతీలుగా..
గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదే అంటూ మంత్రి వివరించారు. ములుగును జిల్లా కేంద్రంగా చేసి మున్సిపాలిటీగా చేశామని, మెడికల్ కళాశాల, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత తమకే దక్కుతుందని వివరించారు. రూ. 133 కోట్లతో ఈ పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ములుగు వైద్య రంగంలో ముందు వరుసలో నిలిపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కేటీఆర్ వివరించారు. త్వరలో జిల్లాలో 17వేల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వనున్నట్లు ప్రకటించారు.
ఉత్సవాలపై కడుపు మంట ఎందుకు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, సాగునీటి దినోత్సవం నిర్వహిస్తుంటే కొందరికి కడుపు మంట ఎందుకు అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజల సంక్షేమము, అభివృద్ధి, నీటిపారుదల రంగాల పురోగతి సాధించినందుకు ఉత్సవాలు జరుపుకోవడం తప్పా అంటూ నిలదీశారు.
65 లక్షల మందికి 65 వేల కోట్లతో రాష్ట్రంలో రైతుబంధు అమలు చేస్తున్నట్లు వివరించారు. 12 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా పొదుపు గ్రూపులు, గొర్రెల పెంపకం దారులు ఇతరత్రా లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవింద నాయక్, బడే జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సభగా మార్చిన మంత్రి కేటీఆర్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో బుధవారం జరిగిన సాగునీటి దినోత్సవ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రాజకీయ సభగా మార్చివేశారు. ఒక విధంగా ఆయన ఉపన్యాసం ఎన్నికల సభను తలపింపజేసింది. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరణ పేరుతో విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ చేసిన విమర్శలకు ఉత్సవ కార్యక్రమాన్ని వేదికగా మార్చివేశారు. ఆయన ఉపన్యాసం ఆసాంతం కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం గమనార్ధం.
పైగా ఆ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ధనసరి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసి కూడా కేటీఆర్ సభలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో కేటీఆర్ కు కలిసొచ్చింది. లేకుంటే సభా వేదిక కాస్త మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదానికి దారి తీసే అవకాశాలు ఉండేవని పలువురు వ్యాఖ్యానించారు.
ఒక విధంగా సభా మర్యాదలను పాటించకుండా వ్యవహరించారని విమర్శలు వ్యక్తం అయ్యాయి. పైగా ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు కూడా భాగస్వామ్యం అయ్యారు. అభివృద్ధి విషయంలో పోల్చ దలుచుకుంటే కాంగ్రెస్ హయాంలో జరిగిన పొరపాట్లను ఎత్తిచూపవచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం గమనార్హం. ఏది ఏమైనా ఉత్సవాలను కాస్త గులాబీ పార్టీ ఎన్నికల వేదికగా మార్చి వేశారని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.
