KTR | Husnabad
- హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు లేకుండానే సాగిన కార్యక్రమం
విధాత, మెదక్‌ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని మోడీ నల్లదనం తెస్తానని ప్రజలకు బాయ్ ఔర్ బెహినో తుమ్ లోగ్ జనధన్ ఖాతా కోలో పద్రాలాక్ ధన్‌ధన్ దాల్తా అని చెప్పాడని పద్రాలాక్ లేదు బుడ్డ పైసా కూడా వేయ లేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వోడితేల సతీష్ కుమార్‌తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా మొత్తం 27కోట్ల 51లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్టీ మహిళా వసతి గృహం, టీటీసీ సెంటర్, బస్తీ దవాఖానా, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా రూ.3 కోట్ల 50లక్షలతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదు
హనుమంతుడి గుడి లేని ఊరు, సీఎం కేసీఆర్ పథకం అందని ఇళ్లు రాష్ట్రంలో లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం గతంలో దుర్భిక్షంతో కొట్టుమిట్టాడేదని, కరువు నేల ఏదని అడిగితే అందరూ ఈ ప్రాంతమని చెప్పేవారన్నారు. నెత్తురు పారిన, నెర్రలు పారిన నెల ఈ ప్రాంతం ఆ నాడని, కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి జరిగిన ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఎంతో సంతోషమైతున్నదన్నారు.
శివుడి నెత్తిన ఉన్న గంగను భువికి తెచ్చింది ఆ భగీరథుడైతే కింద ఉన్న నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పైకి తెచ్చి మన నెత్తిన మీద ఒక కల్పవల్లిగా ఏర్పాటు చేసిన అపర భగీరథుడు ఈ సీఎం కేసీఆర్ అని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరువు, కాటకాల నుంచి తరిమికొట్టేందుకు గౌరెళ్లి ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Live: బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ, హుస్నాబాద్. @KTRBRS https://t.co/zZzk60EXhj
— BRS Party (@BRSparty) May 5, 2023
గత ప్రభుత్వాల హాయంలో ప్రాజెక్టు శంకుస్థాపనలకే పరిమితం
ఒకప్పుడు ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడితే జీవితంలో నైనా పూర్తయితయా.. నీళ్లు చూస్తామా అనేటట్లు ఉండేదని, ఆనాడు ఎప్పుడో నెహ్రు రాయేసి పోతే సీఎం కేసీఆర్ వచ్చే దాకా కాలువలు తవ్వుతానే ఉన్నారని ఎద్దెవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఎంతమంది అడ్డంకలు సృష్టించినా నాలుగేళ్ల లోపు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.
ఒక నాడు ఊళ్లల్లో ఒవరైనా సచ్చిపోతే కరెంటోళ్లకు ఫోన్ చేసి అర గంట కరెంట్ వేయాలని బతిమిలాడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ హాయంలో తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని చెప్పిండ్రని కానీ ఇచ్చింది లేదు సచ్చింది లేదని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఈనాడు బీఆర్ఎస్ హాయంలో కరెంటు పోతే వార్త అని అది వాస్తవం కాదా లేదా అని ప్రజలు ఆలోచించాలని కోరారు.
చెరువు సుందరీకరణపనులను ప్రారంభించేందుకు వెళ్లగా అక్కడ ఉన్న ఆడబిడ్డలను నీళ్లు వస్తున్నాయా అని అడిగితే వాళ్లు బంజారాహిల్స్‌లో ఎట్లయితే నీళ్లు వస్తున్నాయో మా గ్రామాల్లో కడా అట్లే నీళ్లు వస్తున్నాయని ఆడబిడ్డలు చెబుతుంటే మస్తు సంబురం వేసిందని మంత్రి చెప్పారు.
తెలంగాణ రాక ముందు ఎక్కడ బిందెలు అడ్డం పెడుతారో ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎండకాలం వచ్చిందంటే భయపడేవాళ్లని, దేశంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నీళ్లను అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు.మున్సిపాలిటిని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సతీష్ కోరగానే మంత్రి కేటీఆర్ రూ. 25కోట్ల నిధులను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.
మోడీ ఏం చేసిండో చెప్పాలే
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ పెద్ద పెద్ద మాటలు చెప్పిండని, ఇంత వరకు ఏం చేసిండో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నల్లదనంను బయటకు తెస్తా, దేశంలో ఉండే ప్రతి పేదోడికి, రైతులకు ఇస్తానని చెప్పిన డబ్బులు వేయాలేదని అందరిని జన్‌దన్ ఖాతా తెరవమన్నాడు తప్పా అల్ల ఎసిందిలేదని మంత్రి దుయ్యాబట్టారు.
మోడీ వచ్చినప్పుడు సిలిండర్ ధర రూ. 400 ఉండేదని అయ్యాలా రూ. 1200కు పెంచిండన్నారు. ప్రధాని మోడీ ధరలు పెంచి ఆడబిడ్డల ఉసురుపోసుకుంటుండన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాన్నాడు చేయలే, ఇలా చెప్పిన హామీలన్ని గాలికి వదిలేసి మోడీ గాలిలో తిరుగుతున్నాడని ఎద్దెవా చేశాడు.
నరేంద్రమోడీ పేద ప్రజలకు చేసిందేమి లేదు గానీ బడాయి మాటలు మాట్లాడడం తప్పా ఏమీ లేదన్నారు. ఇక్కడ బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారికి దమ్ముంటే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చి చూపించాలని సవాల్ విసిరారు. అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని పునరుద్ఘటించారు.
షటిల్ ఆడిన కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవకాశం దొరికిన ప్రతిసారి తనలో ఉన్న క్రీడాకారుణ్ని బయటకు తీస్తూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు తనలో ఉన్న క్రికెటర్, బాస్కెట్ బాల్ ప్లేయర్‌ని మనకు చూపించిన కేటీఆర్ తనలో ఉన్న షటిల్ స్టార్‌ను కూడా చూపించారు. కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన కేటీఆర్ ఈ సందర్భంగా కాసేపు షటిల్ ఆడి సందడి చేశారు.