KTR | Nalgonda
- 1,164 కోట్లతో నల్గొండ పట్టణంలో సుందరీకరణ, అభివృద్ధి పనులు
- శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న మంత్రులు కేటీఆర్ జగదీశ్ రెడ్డి
విధాత: సీఎం కేసీఆర్ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం వర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న గత ఎన్నికల హామీల అమలులో భాగంగా చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ఈనెల 15న నల్గొండకు రాబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించిన పక్షంలో నల్లగొండను దత్తత తీసుకొని రూపురేఖలు మారుస్తానన్న సీఎం కేసీఆర్ ఈ మేరకు జిల్లా కేంద్రమైన నల్గొండ మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికి వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారు.
ఇప్పటికే 1,164 కోట్లతో నల్గొండ పట్టణంలో సుందరీకరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తానిచ్చిన హామీల అమలు సక్రమంగా సాగేందుకు సీఎం కేసీఆర్ సిద్దిపేట కమిషనర్ రమణాచారికి అదనంగా నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ బాధ్యతలు అప్పగించి పనులు వేగంగా జరిగేలా తరచూ పర్యవేక్షణ చేస్తుండడం విశేషం. ఇప్పటికే పూర్తయిన కొన్ని పనులను గతంలో జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు ప్రారంభించారు.
తాజాగా మరో 123.52 కోట్ల పనులు పూర్తికావడంతో వాటి ప్రారంభోత్సవంతో పాటు కొత్తగా మంజూరైన 590 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. మంత్రి పర్యటన సందర్భంగా మరో 102.74 కోట్ల పనుల మంజూరుకు ప్రతిపాదనలను సమర్పించనున్నారు.
అయితే సీఎం కేసీఆర్ గత ఎన్నికల హామీ మేరకు నల్గొండ పట్టణాభివృద్ధి, సుందరీకరణ పనులు జరుగుతున్నప్పటికీ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ రూరల్ మండలం, కనగల్, తిప్పర్తి మండలాల గ్రామాల్లో మాత్రం ఆశించిన అభివృద్ధి జరగడం లేదన్న అసంతృప్తి గ్రామీణ ప్రాంత ప్రజల్లో వినిపిస్తుంది.
నల్గొండ పట్టణం అభివృద్ధి పనుల్లో సైతం ఎక్కువగా అధికార పార్టీ నేతలకు కాంట్రాక్టులు, కమిషన్లు వచ్చే పనులు, జనాన్ని ఆకర్షించే పై మెరుగులన్నట్లుగా కనిపించే పనులు మాత్రమే సాగుతున్నాయంటు విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.
కేటీఆర్ చేయనున్న ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్న 123.52 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చర్లపల్లి గ్రామ శివారులో చెరువు పక్కన 3.02 కోట్లతో ఏర్పాటుచేసిన అర్బన్ పార్కును ప్రారంభిస్తారు. మర్రిగుడ జంక్షన్ నుంచి గడియారం సెంటర్ వరకు 118 కోట్లతో నూతనంగా విస్తరించిన రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఫుట్ పాత్, డ్రైనేజీ పనులను ప్రారంభిస్తారు. 25 లక్షలతో ఆధునీకరించిన సుభాష్ చంద్రబోస్ విగ్రహా జంక్షన్‌ను, అంబేద్కర్ విగ్రహ జంక్షన్‌ను, 81 లక్షలతో ఏర్పాటు చేసిన రైతుబజార్‌ను, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 1.16 కోట్లతో నిర్మించిన భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు .
ఇక 590.01 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. వాటిలో 139.21 కోట్లతో వానగలు ట్యాంక్బండ్ సుందరీకరణ, కట్టపై సెంట్రల్ లైటింగ్, సైకిల్ ట్రాక్ , గ్రీనరీ పనులకు, 30 కోట్లతో నిర్మించే ఎన్జీ కళాశాల భవనం, 12.25 కోట్లతో నిర్మించే ఆర్ అండ్ బి అతిథి గృహం, సర్కిల్ ఇంజనీర్ కార్యాలయం, 90.61 కోట్లతో నిర్మించే కళాభారతి భవనం, 252.94 కోట్లతో అమృత్ స్కీం రెండో దశ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేనున్నారు.
కాగా ఆదివారం మున్సిపాలిటీ 48వ వార్డులో 70 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిలు శంకుస్థాపన చేయడం గమనార్హం.