విధాత: బీఆర్ఎస్ పార్టీ ప్రకటన నుంచి ఆవిర్భావ సభ వరకు ఎక్కడా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కనిపించడం లేదు. ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతోంది. భారత్ రాష్ట్ర సమితి స్థాపన, దాని గురించి ఇతర రాష్ట్రాల, పార్టీల నేతలతో సంప్రదింపుల సమయంలో కూడా కేసీఆర్ తన వెంట కుమార్తె కవితనే తీసుకెళ్లారు. నిన్న ఖమ్మంలో జరిగిన భారీ సభలో సైతం కేటీఆర్ కనిపించలేదు.
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు కేటీఆర్కు ఇష్టం లేదా, లేకుంటే తండ్రి జాతీయ రాజకీయాలు చూసుకుంటే, కొడుకు రాష్ట్ర రాజకీయాలు చూసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లడం లేదా అన్నది జవాబు లేని ప్రశ్నగా మారింది. భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య జల వివాదాలు, సరిహద్దు వివాదాలు వంటివి వస్తే, కేటీఆర్ గట్టిగా మాట్లాడేందుకు వీలుగానే ఆయన్ను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా కూడా కొంతమంది చెబుతున్నారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ. ఆ పార్టీ ప్రచారంలో, వేదికలపై కేటీఆర్ కనిపించి, రేపు ఏపీతోనో, మహరాష్ట్ర తోనో, కర్ణాటకతోనో ఏదైనా వివాదం వస్తే, అప్పుడు కేటీఆర్ ప్రాంతీయ వాదం వినిపిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతీయ వాద పార్టీనేత ప్రాంతీయ వాదం మాట్లాడటం ఏంటనే విమర్శలు వస్తాయి. వాటికి సమాధానం చెప్పే నైతిక అర్హత కూడా కోల్పోవాల్సి వస్తుంది.
అదే కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటే, తెలంగాణ హక్కుల గురించి గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరూ విమర్శించేందుకు వీలుండదు. ఈ భవిష్యత్ వ్యూహంతోనే కేటీఆర్ జాతీయ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు కేసీఆర్ అనుయాయులు చెప్పుకొంటున్నారు.