Warangal | వీసీ చాంబర్ పై ఏబీవీపీ, విద్యార్థుల దాడి సీపీ ఆధ్వర్యంలో చిత్రహింసలు : విద్యార్థులు పోలీసుల తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం విద్యార్థుల ఆరోపణలు ఖండించిన సీపీ అడ్మిషన్లలో అవకతవకలు జరగలేదు : వీసీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ అడ్మిషన్ల పై నెలకొన్న వివాదం తీవ్రమైంది. అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ, బీసీ సంఘం విద్యార్థులు వీసీ చాంబర్ పై బుధవారం సాయంత్రం దాడిచేశారు. కంప్యూటర్లు, ఫర్నీచర్ […]

Warangal |

  • వీసీ చాంబర్ పై ఏబీవీపీ, విద్యార్థుల దాడి
  • సీపీ ఆధ్వర్యంలో చిత్రహింసలు : విద్యార్థులు
  • పోలీసుల తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
  • విద్యార్థుల ఆరోపణలు ఖండించిన సీపీ
  • అడ్మిషన్లలో అవకతవకలు జరగలేదు : వీసీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ అడ్మిషన్ల పై నెలకొన్న వివాదం తీవ్రమైంది. అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ, బీసీ సంఘం విద్యార్థులు వీసీ చాంబర్ పై బుధవారం సాయంత్రం దాడిచేశారు. కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసమైంది. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. సీపీ రంగనాథ్ ఎదుటే లాఠీలతో చితక బాదినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇదే విషయాన్ని విద్యార్థులు కోర్టులో జడ్జి ముందు వివరించడంతో వివాదం మరింత ముదిరింది. తమను పోలీసులు తీవ్రంగా హింసించారంటూ నిరసన చేపట్టిన విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులకు మద్ధుతుగా రంగంలోకి దిగిన బీజేపీ నాయకులు రావు పద్మ, రాకేష్ రెడ్డి ఇదే విషయాన్నిస్పష్టం చేస్తున్నారు. కాగా, ఇవి పాతగాయాలంటూ వరంగల్ సీపీ రంగనాథ్ వాదిస్తున్నారు. అడ్మిషన్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వీసీ చెబుతున్నారు. సీపీ, వీసీతో పాటు ఎంజీఎం ఆర్ఎంవో మురళి ముగ్గురూ ఒకే వేదిక పై గురువారం మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి. బుధవారం వీసీ చాంబర్ వద్ద నిరసన చేపట్టిన తమను చిత్రహింసలు పెట్టి తప్పుడు మెడికల్ రిపోర్ట్స్ తో జిల్లా జడ్జి ఎదుట హాజరు పరిచారని ఏబీవీపీ విద్యార్థులు శంకర్, రాంబాబు, అంబాల కిరణ్, బీసీ విద్యార్థి ప్రతినిధి నాగరాజు చెబుతున్నారు. ఇదే విషయాన్ని జడ్జి ముందు తమ గాయాలు చూపించామని వివరించారు.

దీంతో రీ మెడికల్ ఎగ్జామినేషన్ కు ఆదేశించినట్లు చెప్పారు. యూనివర్సిటీలో వీసీని ప్రశ్నించినా, క్యాంపస్ లో కనిపించినా కాల్చి వేస్తానని సీపీ రంగనాథ్ భయబ్రాంతులకు గురిచేశారని జడ్జి ముందు చెప్పడంతో కోర్టు సీరియస్ గా తీసుకుంది. కోర్టు ఆదేశాలతో రీ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత విద్యార్థులను జడ్జి ముందు గురువారం హాజరుపరిచారు.

విద్యార్థుల ఆరోపణల్లో వాస్తవం లేదు: సీపీ రంగనాథ్

కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకు నేను గన్ పెట్టి బెదిరించానని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేనే దగ్గరుండి కొట్టానని చెబుతున్నారు. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ చాంబర్ డోర్ పగలగొట్టి, కంప్యూటర్లు ధ్వంసం చేశారు.

ఈ విద్యార్థులే ఫిబ్రవరి 28న బైరి నరేష్ పై దాడి చేశారు. వైద్య పరీక్షల బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని, తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు. పాత గాయాలు చూపి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సీపీ వివరించారు. ఇలాంటి ఆరోపణలు మాకు కొత్తకాదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించమని స్పష్టం చేశారు.

పీహెచ్ డీ అడ్మిషన్లలో అవకతవకలు లేవు: వీసీ రమేష్

కేయూ పీహెచ్ డీ కేటగిరి-2 అడ్మిషన్ లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని యూనివర్సిటీ వీసీ రమేష్ మీడియా సమావేశంలో ప్రకటించారు. పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించామన్నారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించాం.

మాకు కులం, మతంతో సంబంధం లేదు. రూల్స్ కు అనుగుణంగానే సీట్లు కేటాయించామన్నారు. మీడియా సమావేశంలో ఎంజీఎం ఆర్ యు 2 మురళి, హనుంకొండ,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ లు జితేందర్ రెడ్డి, కిరణ్ కుమార్, కేయూ రిజిస్ట్రార్ సత్యనారాయణ, కేయూ ఇన్స్ స్పెక్టర్ అబ్బయ్య, ఎస్ఐలు సురేష్, సుమన్ పాల్గొన్నారు.

విద్యార్థులకు అండగా బీజేపీ

ఏబీవీపీ విద్యార్థులకు బీజేపీ నాయకులు రావు పద్మ, రాకేష్ రెడ్డి అండగా నిలిచారు. విద్యార్థులను పరామర్శించారు. కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో, ఎంజీఎంలో మెడికల్ ఎగ్జామినేషన్ సమయంలో తోడుగా ఉన్నారు. ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టులు చేయించి విద్యార్థులను సంఘవిద్రోహ శక్తులుగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు విచక్షరహితంగా కొట్టి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పద్మ అన్నారు.

ప్రభుత్వానికి పాలన చేతకకపోతే తప్పుకోవాలిగానీ ఇలా న్యాయం కోసం పోరాడే వారిపై పోలీసులతో దాడి చేయిస్తే తమ పార్టీ అధ్వర్యంలో బదులు చెప్పాల్సి వస్తుందన్నారు. విద్యార్థులను తీసుకొని వెళ్లి వారిని కొట్టి తీవ్రంగా గాయపరిచే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు, కేసీఆర్, కేటీఆర్ మీరే ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.

Updated On 8 Sep 2023 10:47 AM GMT
somu

somu

Next Story