- నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
విధాత: ఓ తండ్రి కామంతో కూతురి పైనే కన్నేశాడు. భార్య చనిపోవడంతో.. కూతురిని లొంగదీసుకుని తన కోరికలను తీర్చుకున్నాడు. చివరకు ఆ బాలిక గర్భిణి అని తేలడంతో.. అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్నగర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. 40 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి భవన నిర్మాణ రంగ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆయన భార్య మూడేండ్ల క్రితం చనిపోయింది. కూతురి(14)తో కలిసి అతను షాద్నగర్లో ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసగా మారిన ఆ వ్యక్తి కూతురిపైనే కన్నేశాడు.
గత ఆరు నెలల నుంచి ఆ బాలికపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. అయితే గురువారం స్కూల్కు వెళ్లిన విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో ఆమెను టీచర్లు హాస్పిటల్కు తీసుకెళ్లగా, గర్భిణి అని తేలింది. దీంతో టీచర్లు, తోటి విద్యార్థినులు షాక్కు గురయ్యారు.
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.