విధాత‌: ఎప్పుడు రాజకీయ విశ్లేషణలేనా ఓ రెండు రోజులు ప్రశాంతంగా అవన్నీ పక్కన పెట్టాలనిపించింది. ఉగాది పండుగ సందర్భంగా సామాన్యుడిగా గడిపేద్దాం అనుకున్నా. మా పిల్లలు అడిగితే సార్ సినిమా చూశాం. సినిమా చాలా బాగుంది. సినిమా కథ ఇంటర్మీడియట్ కళాశాల స్థాయి విద్య పైన నడిపించినా మొత్తం విద్యా వ్యవస్థకు దర్పణంలా ఉంది. 1990లలో మేము ఉద్యోగంలో చేరిన కొత్తలో పాఠశాల విద్య స్థితిగతులు గుర్తుకొచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఇంకా దయనీయంగా ఉండేది. కనీస […]

విధాత‌: ఎప్పుడు రాజకీయ విశ్లేషణలేనా ఓ రెండు రోజులు ప్రశాంతంగా అవన్నీ పక్కన పెట్టాలనిపించింది. ఉగాది పండుగ సందర్భంగా సామాన్యుడిగా గడిపేద్దాం అనుకున్నా. మా పిల్లలు అడిగితే సార్ సినిమా చూశాం. సినిమా చాలా బాగుంది. సినిమా కథ ఇంటర్మీడియట్ కళాశాల స్థాయి విద్య పైన నడిపించినా మొత్తం విద్యా వ్యవస్థకు దర్పణంలా ఉంది. 1990లలో మేము ఉద్యోగంలో చేరిన కొత్తలో పాఠశాల విద్య స్థితిగతులు గుర్తుకొచ్చాయి.

గ్రామీణ ప్రాంతాలలో అయితే ఇంకా దయనీయంగా ఉండేది. కనీస రవాణా వసతులు లేక పోయినప్పటికీ చదువుకోవాలనే కాంక్ష అందరిలో బలీయంగా ఉండేది. అప్పటి కొత్త తరం టీచర్లు చాలామంది ఇదే విధమైన ప్రయత్నాలు చేశారు. పాఠశాలకు దూరమైన విద్యార్థులను చదువుల బాట పట్టించారు. మంచి సందేశాత్మక చిత్రం. అందరూ చూడ తగిన చిత్రం, ముఖ్యంగా టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ చూడవలసిన సినిమా.

రెండో రోజు బలగం సినిమా చూశాను. ఈ సినిమా చూసి ఏడ్వనోల్లు ఉండరు. తెలంగాణ జీవితాన్ని తెరపై చిత్రీకరించిన విధానం అద్భుతం. చావు, బతుకుల మధ్య సాంస్కృతిక, ఆత్మీయ సంబంధాలను సజీవంగా కండ్ల ముందు నిలబెట్టారు. చావు చుట్టు అల్లుకున్న కుటుంబ, సామాజిక ఆచారాలను హృద్యంగా చూపించారు. అంతిమయాత్రలు ఘనంగా నిర్వహించే ఆచారం మనదేశంలో అంతటా ఉన్నది. ఈ సినిమాలో మాత్రం తెలంగాణ ప్రజల ఆచారాలు, సాంస్కృతిక వ్యవహారాలను చూపించినారు.

గత నాలుగు ఐదు ఏళ్ళుగా తెలంగాణ యాసలో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అద్భుత విజయాన్ని సాధించడం మన భాషలోని యాసకు పట్టం కట్టినట్టు అయింది. ఇది తెలంగాణ భాష యాస, సంస్కృతికి గౌరవం దక్కాలని పోరాడిన వాళ్ళందరికీ సంబురం అనిపించే విషయం. చాలామంది తెలంగాణ యువకులు దర్శకత్వ శాఖలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కళా రంగంలోని అన్ని విభాగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. యూట్యూబ్ లో తెలంగాణ జానపద గీతాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అనేక పాటలు 50 - 100 మిలియన్ ల వ్యూస్ కలిగి పెద్ద హీరోల సినిమా పాటలతో పోటీ పడుతున్నాయి.

ఇంకొక అద్భుతం ఏమిటంటే ఈ రెండు రోజులు ఎవరు ఫోన్ ఆన్ చేసిన రీల్స్, షాట్స్ లాంటి సోషల్ మీడియా యాప్స్ లో వేలాదిమంది చేసిన ఒక షార్ట్ వీడియో హాల్ చల్ చేస్తున్నది. దసరా సినిమా లోని పాట. 'చమ్కీల అంగి లేసి ఓ వదినే, చాకు లెక్కుండేటోడే ఓ వదినే'… తెలంగాణ యాసలో మొగడు పెళ్ళాల సంవాదంగా సాగే ఈ పాట ఒక్కొక్కరికి మిలియనుకు తగ్గకుండా వ్యూస్ రావడం, మన యాసకున్న మాధుర్యానికి మెచ్చుతునక. ఈ పాటలోని లిరిక్స్ కూడా అచ్చమైన తెలంగాణ తనాన్ని, భార్యాభర్త సంబంధాన్ని, వారి మధ్య జరిగే నిత్య సంవాదాన్ని ప్రతిబింబించింది.

తెలంగాణ యాసలో రాసిన ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ కుదరడం దానికి అనుగుణంగా గాయకులు తమ గాత్రంతో తెలంగాణ జీవితపు సహజత్వాన్ని పలికించారు. తెలుగులోనే కాదు తమిళంలో 'మైనరు వెట్టి కట్టి' అని సాగే ఈ పాట ఆ భాషలోనూ అంతే పాపులర్ అయింది. కన్నడంలో కూడా అనేకమంది మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందడం ఆనందదాయకం. ఇది తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యానికి దక్కుతున్న 'పురస్కార్'.

- ఎర్రోజు శ్రీనివాస్

Updated On 28 March 2023 2:27 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story