విధాత: టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల కోత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగంలోని అస్థిరత, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం తదితర భయాల నేపథ్యంలో అనేక కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ట్విటర్, మెటా, అమెజాన్ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకొన్నాయి. తాజాగా ఇదే బాటలో ప్రఖ్యాత టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా తన ఉద్యోగుల్లో 5శాతం తగ్గించుకోవటానికి సమాయత్తమవుతున్నది.
మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 2,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో అమెరికాలో 1,22,000 మంది పనిచేస్తుండగా, వివిధ దేశాల్లో 99,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఐదు శాతం అంటే… 11,000 మందిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో ముఖ్యంగా మనవ వనరులు, ఇంజినీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తున్నది.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ మధ్యనే మాట్లాడుతూ… ఉద్యోగులు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. గత కొంత కాలంగా కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నదని అంటూ.. దీనికి మైక్రోసాఫ్ట్ అతీతమేమీ కాదని తెలిపారు. ఉద్యోగులు మరింత నైపుణ్యాలతో ముందుకు పోకుంటే పరిస్థితులు గడ్డుగా ఉంటాయని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోంచే ప్రస్తుత ఉద్యోగుల కుదింపు, లేదా తొలగింపు అని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే… వాషింగ్టన్ లోని బాలేవూలో ఉన్న 26 అంతస్తుల సిటీసెంటర్ ప్లాజా భవన లీజ్‌ను మైక్రోసాఫ్ట్ యాజమాన్యం పొడిగించలేదని తెలుస్తున్నది. అంటే.. ఉద్యోగుల తొలగింపు భారీ సంఖ్యలో ఉండబోతున్నదనటానికి ఇది సంకేతమని సాఫ్ట్వేర్రంగ విశ్లేషకులు అంటున్నారు.