Wednesday, December 7, 2022
More
  Homelatestతెలంగాణ కాంగ్రెస్‌కు నాయ‌కులే శాప‌మా?

  తెలంగాణ కాంగ్రెస్‌కు నాయ‌కులే శాప‌మా?

  ఉన్నమాట: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న చందంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైందా? ఎన్నో ఏళ్ల తెలంగాణ పోరాటానికి ప్ర‌త్యేక రాష్ట్రం ఇవ్వ‌డం ద్వారా ప్ర‌త్యేక తెలంగాణ ఆకాంక్ష‌ను నెర‌వేర్చిన పార్టీగా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఉన్నారు. కానీ న‌మ్మ‌క‌మైన నాయ‌క‌త్వ‌మే లోపంగా మారిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

  కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, ముఠాలు ఇవ్వాళ కొత్త‌ కాదు. కానీ ఇప్పుడు ఈ గ్రూపులు, ముఠాల పోరు వ‌ల్ల మొత్తంగా పార్టీనే ప్ర‌జ‌ల అభిమానాన్ని, కార్య‌క‌ర్త‌ల క‌ష్టాన్ని సీట్ల రూపంలో, ఓట్ల రూపంలో మార్చు కోలేక‌పోతోంది. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు తెలంగాణ‌లో అటు ప్ర‌జ‌ల నుంచి, ఇటు కార్య‌క‌ర్త‌ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. రోజుకు క‌నీసం 50 వేల‌మందికి త‌క్కువ కాకుండా ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. డ‌బ్బు, మందు, బిర్యానీ లేకుండా కూడా రాహుల్ యాత్ర తెలంగాణ వ్యాప్తంగా దిగ్విజ‌యంగా ముగిసి మ‌హ‌రాష్ట్రలోకి అడుగుపెట్టింది.

  మ‌రీ…ఈ ప్ర‌జాబ‌లం అంతా ఓట్ల ద‌గ్గ‌ర‌, సీట్ల ద‌గ్గ‌ర ఏమ‌వుతోంది? ఎందుకు ప్ర‌జ‌లు కాంగ్రెస్‌పై అభిమానం ఉండికూడా ఆ పార్టీ నాయ‌కుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌టం లేదు? ఎవ‌రిది లోపం, ఎవ‌రికి శాపం? తెలంగాణ కాంగ్రెస్‌కు గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు బాగానే మ‌ద్ద‌తు ప‌లికారు. కేసీఆర్ వ్యూహాల ముందు తెలంగాణ కాంగ్రెస్ నాయ‌క‌త్వం చ‌తికిల‌ ప‌డినా కాంగ్రెస్ ప‌రువు నిల‌బెట్టే స్థాయిలో సీట్ల‌ను ఇచ్చారు. కానీ.. వారిలో చాలామంది అధికార పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. మ‌రికొంద‌రు ప‌రోక్షంగా అధికార పార్టీల‌కు తొత్తులుగా మారారు.

  ఈ అమ్ముడుపోయే నాయ‌క‌త్వ విధానాలే ప్ర‌జ‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై విశ్వాసం స‌న్న‌గిల్లేలా చేస్తున్నాయి. వీరికి ఓటేసినా కూడా గెలిచాక అమ్ముడు పోతారులే అన్న నిర్వేదంకాంగ్రెస్ అభిమాన ఓట‌ర్ల‌లో రోజు రోజుకూ బ‌ల‌ప‌డుతోంది. నిన్న‌టి మునుగోడు ఎన్నిక‌లే దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకుంటున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల‌ కోస‌మో, రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వం అంటే ఇష్టంలేకో కానీ బీజేపీ వైపు వెళ్లిపోయారు.

  బిజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నాక‌, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగారు. ఇది అక్క‌డి కాంగ్రెస్ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌లేదు. రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఎన్నిక‌ల టికెట్ ఇద్ద‌రు ముగ్గురు ఆశించినా, పాల్వాయి కుమార్తె స్ర‌వంతికి అధిష్టానం మొగ్గు చూపింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ‌దులుకున్న సీటులో పోటీ చేసిన స్రవంతికి డిపాజిట్ కూడా రాలేదంటే, అక్క‌డి ఓట‌ర్లు కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై ఎంత‌గా విసిగిపోయారో అర్థ‌మ‌వుతోంది.

  ఇక రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టాక హుజూరాబాద్‌, దుబ్బాక‌, మునుగోడుల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. కానీ ఏ ఒక్క ఎన్నిక‌లోనూ కాంగ్రెస్ పార్టీకి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చిన ఓట్లు కూడా రాలేదు. దీన్నిబ‌ట్టి తెలంగాణ కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై ఆ పార్టీ శ్రేణుల‌కు విశ్వాసం స‌న్న‌గిల్లు తోంద‌నే అభిప్రాయం తేట‌తెల్ల‌మ‌వుతోంది. వీరిని గెలిపించినా మ‌రో పార్టీ పంచ‌న చేరే వారే కాబ‌ట్టి, గెలిపించ‌క‌ పోవ‌డ‌మే మేలన్న‌ది మెజార్టీ తెలంగాణ కాంగ్రెస్ అభిమానుల అభిప్రాయం.

  రాహుల్ గాంధీ జోడో యాత్ర‌కు కూడా తెలంగాణ‌లో సాంప్ర‌దాయ కాంగ్రెస్ అభిమానులు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివెళ్లారు త‌ప్ప, నాయ‌కులు త‌ర‌లించి ఏమీ లేద‌న్న వాస్త‌వాన్ని ఆ పార్టీ నేత బ‌క్క జ‌డ్స‌నే స్వ‌యంగా చెప్పారు. మ‌రి రాహుల్ యాత్ర‌కు వ‌చ్చిన కాంగ్రెస్ అభిమానం.. ఎన్నిక‌ల స‌మ‌యంలో లేక‌పోవ‌డానికి నాయ‌క‌త్వ లోప‌మే అంటున్నారు ఆయ‌న‌.

  దేశవ్యాప్తంగా దాదాపు 180 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడుతున్నది. బీజేపీ టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఆ అభిప్రాయం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ప్రజలు అనుకుంటున్నారు. దీనికి నిదర్శనం ఏమిటంటే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన యాత్రలో రోజూ సుమారు 50 వేల మంది పాల్గొంటున్నారు. కానీ ఆపార్టీని నాయకత్వ సమస్య ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించలేక పోతున్నది. ఫలితంగా రాష్ట్రంలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆదరణను ఓట్ల రూపంలో మలుచుకోలేకపోయింది.

  దీనికి కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతలు గెలిచినా అమ్ముడుపోతారనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. కాంట్రాక్టుల కోసం, అధికారమే పరమావధిగా స్వలాభం కోసం పార్టీ మారుతారనేది వాళ్లు నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ బలం ఉన్నప్పటికీ ఇక్కడి నాయకత్వాన్ని ప్రజలు నమ్మడం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 30 నుంచి 40 స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి గెలిచే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉన్నది. కానీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నది.

  ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ అంతర్గత కలహాలతో పార్టీని బలహీనపరుస్తున్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పలుచన అవుతున్నారు. అధికార పార్టీపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన కీలక సందర్భంలో రోడ్డుకెక్కుతున్నారు. ఈ గొడవలే కాంగ్రెస్‌ పార్టీకి గుదిబండగా మారాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఈ సమయంలో రాహుల్ పాదయాత్రలో ప్రజలు కోరుకుంటున్నట్టుగా సంఘటితంగా పోరాటం చేసి వారి విశ్వాసాన్ని తిరిగి పొంద గలిగితే అధికారం అందించడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా కలహాలతోనే కాలం వెళ్లదీస్తామని అని అనుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కష్టమే

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page