విధాత: పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నాం.. మాకు పదవుల్లేవు.. గుర్తింపులేదు.. ఉన్నామో.. చచ్చామో.. పోయామో పార్టీకి తెలీదు.. ఇలా అయితే ఎలా అని పార్టీ నాయకులు అధినాయకత్వం మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. విజయవాడలో ఈమధ్య వైసిపి పార్టీ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ఈ అన్ని సంఘాలకూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్దినేటర్ కాబట్టి ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడబోయారు. మున్ముందు మనదే రాజ్యం.. మనం కష్టపడాలి.. పార్టీని మోయాలి.. అన్నను గెలిపించాలి అని ఉద్వేగంగా మాట్లాడారట. దీనికి వాళ్ళు రిప్లై ఇవ్వడం మొదలు పెట్టగానే ఈయనకు సౌండ్ లేదట.
తొమ్మిదేళ్ల పాటు వైఎస్ జగన్ కోసం పని చేశామని, తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం తమలో మిగల్లేదని వారంతా అంటున్నారు.
నాలుగేళ్ల అధికారం పూర్తయిందని, జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడ్డ సామాన్య కార్యకర్తలు, గ్రామ, మండల నాయకులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుందామని, రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్ధరిస్తామని వైసీపీ ముఖ్య నాయకులు చెప్పడం ఏంటని అనుబంధ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఇంతకాలం పార్టీని అధికారంలోకి తెచ్చుకునే క్రమంలో నష్టపోయిన కాలాన్ని, డబ్బును, ఇతరత్రా నష్టాన్ని ఎవరు చెల్లిస్తారని అనుబంధ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. పదేపదే జగన్‌ను సీఎం చేయడానికి తాము శ్రమించాలే తప్ప, ఆయన చేసేదేమీ వుండదా? అని అనుబంధ సంఘాల సమావేశాల్లో నాయకుల మాటలకు చిర్రెత్తుకొచ్చిన వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆయన వారికి ఏదోలా సర్దిచప్పుకున్నారని అంటున్నారు.