విధాత: పెళ్లి అయిన వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యాననీ, భార్య తనతో ఫోన్ చేసినా మాట్లాడటం లేదనీ… కావున అలిగిన భార్యను సముదాయించటానికి సెలవు కావాలని ఉన్నతాధికారులను కోరిన ఓ పోలీస్ ఉదంతాన్ని మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకున్నది.
యూపీ బైద్పూర్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సోనూ చౌదరి సెలవు కావాలని కోరినా ఉన్నతాధికారులు ఇవ్వలేదు. దాంతో ఆయన డ్యూటీలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితం… అతని చిన్నారి కొడుకు శవాన్ని భుజంపై మోస్తూ ఎస్పీ ఆఫీసుకు…కానిస్టేబుల్!
సోనూ చౌదరి ఉత్తరప్రదేశ్‌లోని బైద్పూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్యకు శస్త చికిత్స జరిగింది. ఇంటి పనులు చేసుకోవటం, కొడుకును చూసుకోవటం భార్యకు ఇబ్బంది కాబట్టి కుటుంబానికి సాయంగా ఉండేందుకు సెలవు కావాలని కానిస్టేబుల్ సోను కోరాడు. కానీ అధికారులు ఆయన మాటలు విశ్వసించలేదు.
సెలవు మంజూరు చేయలేదు. దీంతో ఆయన డ్యూటీలో కొనసాగాడు. ఫలితంగా అనారోగ్యంతో భార్య ఇంట్లో ఉంటే చిన్నపిల్లవాడు ఆడుకొంటూ ఇంటిముందటి వాకిట్లో ఉన్న నీటి తొట్లో పడిపోయాడు. కొడుకు ఎంతకు ఇంట్లోకి రాకపోవటంతో తల్లి ఇంటి పరిసరాల్లో వెతికినా కనిపించలేదు. చివరకు నీటితొట్లో చూసే సరికి అందులో కనిపించిన కొడుకును చంకనేసుకొని ఆస్పత్రికి పరిగెత్తింది. పిల్లవాడు అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పటంతో ఆ తల్లి కుప్పకూలిపోయింది.
తనకు అధికారులు సెలవు మంజూరు చేయనందుకే.. తన కుమారుడు చనిపోయాడని తెలపటానికి కానిస్టేబుల్ సోనూచౌదరి.. కొడుకు శవాన్ని భుజాన వేసుకొని ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని వాపోయాడు.
ఇలాంటి ఘటనే ఈ మధ్యన మరొకటి చోటుచేసుకున్నది. ఓ కానిస్టేబుల్ పెండ్లి అయిన మరునాడే డ్యూటీలో చేరాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా అధికారులు అతనికి సెలవు ఇవ్వలేదు. దాంతో సెలవు దొరకగానే ఇంటికి వస్తానని చెప్తూ భార్యకు చెప్పాడు. వస్తానని చెప్పటమే కానీ రాని భర్తపై విసుగుతో ఆమె అలిగింది.
ఫోన్ చేసినా మాట్లాడటం మానేసింది. దీంతో గాబరా పడిన కానిస్టేబుల్ తనకు సెలవు కావాలని, అలిగిన బార్యను సముదాయించటానికి అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరుతూ లేఖ రాశాడు.
శాంతి భద్రతల విభాగాలైన పోలీసులు, పారా మిలిటరీ, మిలిటరీ రంగాల్లో ఆర్డర్లీ విధానం ఉంటుంది. అంటే.. ఉన్నతాధికారి మాటే శాసనం. కింది ఉద్యోగులు ఉన్నతాధికారి చెప్పిందే వేదంగా అనుసరించాలి. హక్కుగా దేన్నీ కోరే పరిస్థితి ఉండదు.
ఈ నేపథ్యంలోంచే… పోలీసులు ఎంత అత్యవసరం ఉన్నదని సెలవు అడిగినా ఉన్నతాధికారి సెలవు మంజూరు చేయని పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ఆ కుటుంబాలు ఎంతో కోల్పోతున్నాయి. ఆప్తులను కోల్పోవటం జరుగుతున్నది.
కుటుంబ సంబంధాలు సమస్యల వలయంలో చిక్కుకొంటున్నాయి. కాబట్టి…, ఎప్పటివో బ్రిటిష్ కాలంనాటి చట్టాలు, విధానాలు నేటికీ కొనసాగడమే సమస్యలన్నింటికీ కారణమని కింది స్థాయి భద్రతా సిబ్బంది పోలీసులు, సైనికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితులను మానవీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు.