అదానీ గ్రూప్ దెబ్బకు పడిపోతున్న విలువ
విధాత: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పెట్టుబడులు కరిగిపోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ (ADANI GROUP) కంపెనీల షేర్లు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు.. ఎల్ఐసీని నష్టాల పాలు చేస్తున్నాయి. అదానీ సంస్థల్లో పెట్టిన ఎల్ఐసీ పెట్టుబడుల విలువ గత నెల 24 నుంచి ఇప్పటి దాకా సుమారు రూ.50వేల కోట్లు పడిపోయింది.
ఈ ఏడాది జనవరి 24న అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ (HINDENBURG).. అదానీ గ్రూప్ అవకతవకలపై ఓ సంచలన రిపోర్టునిచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ దారుణంగా పతనమవుతున్నది.
ఇక అదానీ గ్రూప్‌లోని 7 సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టింది. గత నెల 24న వీటి విలువ రూ.81,268 కోట్లుగా ఉన్నది. ఈ నెల 24న ఇది రూ.32,610 కోట్లకు క్షీణించింది. దీంతో రూ.48,658 కోట్లు పడి పోయినట్టైంది.
అయితే అదానీ గ్రూప్‌లో తమ ఈక్విటీ పెట్టుబడులు రూ.30,000 కోట్లుగానే ఉంటాయని చెప్తున్న ఎల్ఐసీ.. ఇప్పటికీ వాటి విలువ అంతే లేదంటే అంతకు పైగానే ఉందని వాదిస్తున్నది. కానీ గత రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల మధ్య ఈ విలువ రూ.26,000 కోట్ల దరిదాపుల్లోకి వచ్చింది. దీంతో నష్టాల సెగ ఎల్ఐసీకి మొదలైందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
పరిస్థితులు ఇలాగే ఉంటే మరింత నష్టాలు తప్పవని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అదానీ గ్రూప్ వ్యవహారం, ఎల్ఐసీ పెట్టుబడుల నష్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగానే నిలదీస్తున్నాయి. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు (SUPREME COURT) దాకా వెళ్లగా.. లోతుగా విచారణ జరిపితే ఇదో భారీ కుంభకోణమేనంటున్నారు.
ఇక గత నెల రోజుల్లో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల (రూ.12.5 లక్షల కోట్లు) దాకా పడిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలోనూ అదానీ వ్యక్తిగత సంపద 40 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. దీంతో టాప్ 30లో కూడా లేకుండాపోయారు. నెల రోజుల కిందట ప్రపంచ కుబేరుల్లో అదానీ టాప్ 2 ప్లేస్‌లో ఉన్న సంగతి విదితమే.