LPG Gas | ఉజ్వల స్కీం వారికి మరో 200 సబ్సిడీ కొత్తగా 75 లక్షల మందికి ఉచిత కనెక్షన్‌ కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ వెల్లడి ఎన్నికల వేళ బీజేపీ సర్కార్‌ తాయిలం న్యూఢిల్లీ: గ్యాస్‌బండ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 14 కేజీల సిలిండర్‌ ధరను ఏకంగా 200 తగ్గిస్తూ మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం అందరు గృహ వినియోగదారులకు వర్తిస్తుంది. దీనితోపాటు ఉజ్వల స్కీంలో గ్యాస్‌ కనెక్షన్లు పొందినవారికి […]

LPG Gas |

  • ఉజ్వల స్కీం వారికి మరో 200 సబ్సిడీ
  • కొత్తగా 75 లక్షల మందికి ఉచిత కనెక్షన్‌
  • కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ వెల్లడి
  • ఎన్నికల వేళ బీజేపీ సర్కార్‌ తాయిలం

న్యూఢిల్లీ: గ్యాస్‌బండ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 14 కేజీల సిలిండర్‌ ధరను ఏకంగా 200 తగ్గిస్తూ మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం అందరు గృహ వినియోగదారులకు వర్తిస్తుంది. దీనితోపాటు ఉజ్వల స్కీంలో గ్యాస్‌ కనెక్షన్లు పొందినవారికి మరో 200 సబ్సిడీ ప్రకటించారు.

దీంతో ఈ స్కీం వారికి మొత్తంగా 400 తగ్గుతుంది. ఇది దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన కానుక అని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని వెల్లడించిన కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ తెలిపారు. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్యాస్‌ ధర తగ్గించడం విశేషం. పెరుగుతున్న ధరల విషయంలో సాధారణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నంగా ఇది కనిపిస్తున్నది.

గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చినా.. భారీగా ధర ఉన్న సిలిండర్‌ను కొనలేక పోతున్న నిరుపేదలు.. వాటిని వాడటం మానేస్తున్నారని అనేక వార్తలు వచ్చాయి. తిరిగి వారంతా మళ్లీ కట్టెల పొయ్యిలకు మారుతున్నారన్న వార్తలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది. తాము 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో 14.5 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు మాత్రమే ఉండేవని, ఈ రోజు ఆ సంఖ్య 33 కోట్లకు పెరిగిందని అనురాగ్‌ఠాకూర్‌ చెప్పారు. అందులో 9.6 కోట్ల సిలిండర్లను ఉజ్వల స్కీం కింద అందిస్తున్నామని తెలిపారు.

75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు

రక్షాబంధన్‌, ఓనం పండుగల సందర్భంగా 75 లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని ఠాకూర్‌ చెప్పారు. ఇందులో భాగంగా గ్యాస్‌ పొయ్యి, మొదటి గ్యాస్‌సిలిండర్‌, పైప్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ 75 లక్షల మంది కూడా గ్యాస్‌ కనెక్షన్లు పొందితే.. ఉజ్వల స్కీంలో గ్యాస్‌ వినియోగదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుందని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఇప్పుడు సిలిండర్‌ 1150

ప్రస్తుతం 14 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.1053, ముంబైలో రూ.1052, చెన్నైలో రూ.1068, కోల్‌కతాలో రూ.1079గా ఉన్నది. హైదరాబాద్‌లో రూ.1150గా ఉన్నది. గత జూలై నెలలో చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను 50 రూపాయలు పెంచాయి. అంతకు ముందు మే నెలలో రెండుసార్లు ధర పెరిగింది. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాలు- తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది.

ఇక్కడ బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించుకునే ప్రయత్నంగా గ్యాస్‌ ధర తగ్గింపును రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016 మే నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. ఈ నెల మొదటిలో గృహ వినియోగదారులు వాడే సిలిండర్‌ ధరను స్థిరంగా ఉంచుతూ, కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను సవరించాయి. ఫలితంగా ఆగస్ట్‌ ఒకటి నుంచి ఇంట్లో వాడే సిలిండర్‌ ధరలు పెరగలేదు

Updated On 30 Aug 2023 9:57 AM GMT
somu

somu

Next Story