Rats | ఒక్కో ఎలుకను పట్టేందుకు 41వేలు? లక్నో స్టేషన్‌లో రైల్వే శాఖ ఖర్చు ఇదీ ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడి లక్నో: కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఇదేనేమో! లక్నో రైల్వే డివిజన్‌.. తన పరిధిలోని స్టేషన్లలో ఎలుకలు పట్టడానికి రెండేళ్లలో ఏకంగా 69 లక్షలు ఖర్చు చేసిందిట! ఇంత ఖర్చు చేసి పట్టిన ఎలుకలు ఎన్నో తెలుసా? 168. నమ్మండీ నమ్మకపోండి.. ఇది మాత్రం సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు స్వయంగా […]

Rats |

  • ఒక్కో ఎలుకను పట్టేందుకు 41వేలు?
  • లక్నో స్టేషన్‌లో రైల్వే శాఖ ఖర్చు ఇదీ
  • ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడి

లక్నో: కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఇదేనేమో! లక్నో రైల్వే డివిజన్‌.. తన పరిధిలోని స్టేషన్లలో ఎలుకలు పట్టడానికి రెండేళ్లలో ఏకంగా 69 లక్షలు ఖర్చు చేసిందిట! ఇంత ఖర్చు చేసి పట్టిన ఎలుకలు ఎన్నో తెలుసా? 168. నమ్మండీ నమ్మకపోండి.. ఇది మాత్రం సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు స్వయంగా రైల్వే శాఖ ఇచ్చిన సమాధానమే! అంటే సగటున ఒక్కో ఎలుకను పట్టడానికి చేసిన ఖర్చు సుమారు 41వేల రూపాయలు. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌గౌర్‌ దరఖాస్తుకు వచ్చంది ఈ సమాధానం. దీనిపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘రైల్వే శాఖ ఆరు రోజుల వ్యవధిలో ఎలుకలు పట్టడానికి ఒక్కోదానికి 41వేల రూపాయలు ఖర్చు చేసింది. మొత్తం 69.40 లక్షలు ఖర్చు చేసి.. మూడేళ్ల వ్యవధిలో 156 ఎలుకలను బంధించింది. ఇది ఒక్క లక్నో రీజియన్‌ పరిస్థితి మాత్రమే’ అని ఆయన పేర్కొన్నారు.

‘దేశం మొత్తంలో అవినీతి ఎలుకలు ప్రతి రోజూ దేశ ప్రజల జేబులు కొట్టేస్తున్నాయి. ఫలితం బీజేపీ పాలనలో ప్రతిరోజూ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. ఆఖరుకు రైలు చార్జీల్లో వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలను సైతం బుక్కేశారు! అయినప్పటికీ.. ఆయన (మోదీ) మాత్రం ‘నేను తినను.. ఎవరినీ తిననివ్వను’ అంటున్నారు’ అని పేర్కొన్నారు.

ఆర్టీఐ సమాధానాన్ని చూస్తే నివ్వెరపోవడం ఖాయం. ‘2019 నుంచి 2022 వరకూ రైల్వే వార్షిక క్యాలెండర్‌లో ప్రతి ఏటా ఎలుకలను పట్టేందుకు రూ.23,16,150.84 ఖర్చు చేయడమైనది’ అని ఆ సమాధానం పేర్కొంటున్నది. ఈ మూడేళ్ల కాలంలో ఎన్ని ఎలుకలు పట్టింది కూడా రైల్వే శాఖ జాగ్రత్తగా లెక్కగట్టినట్టుంది. 2020లో 83 ఎలుకలను పట్టుకుంటే.. 2021లో 45, 2022లో 40 ఎలుకలను పట్టుకున్నారట.

అయితే.. దీనిపై వివాదం రేగడంతో.. తాము చేసిన ఖర్చులో చెదల నివారణ, బొద్దింకల నిర్మూలన వంటి చర్యలకు అయిన ఖర్చు కూడా ఉన్నదని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. వాటితోపాటు రైలు కోచ్‌లలో క్రిమిసంహారక మందులు చల్లడం, దోమల నివారణకు పొగ వేయడం వంటివి కూడా ఉన్నాయని తెలిపింది.

ఏటా 25వేల రైలు కోచ్‌లను శుభ్రం చేస్తున్నామని, అలా చూసినప్పుడు ఒక్కో కోచ్‌లో ఎలుకల నివారణకు చేసిన ఖర్చు 94 రూపాయలు మాత్రమేనని వివరణ ఇచ్చింది. ఒక్కో ఎలుకను పట్టడానికి 41వేలు ఖర్చయిందని చెప్పడం సరికాదని పేర్కొన్నది. అయితే.. ఎలుకల వల్ల జరిగిన నష్టంపై కూడా చంద్రశేఖర్‌ గౌర్‌ అడిగినా.. అందుకు సమాధానం ఇవ్వలేదు. జరిగిన నష్టాన్ని అంచనా వేయలేదని మాత్రమే బదులిచ్చింది.

Updated On 17 Sep 2023 12:58 PM GMT
krs

krs

Next Story