Madhya Pradesh
- మధ్యప్రదేశ్‌లో ASI సర్వే తవ్వకాల్లో బహిర్గతం
- వాననీటి సేకరణకు అధునాతన జలాశయాలు
- తొలిచిన గుహలో 1500 ఏళ్లనాటి శిల్ప చిత్తరువు
విధాత: తవ్వినకొద్దీ ఘన చరిత్ర బయటపడే మహత్తర దేశం మనది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బంధ్వాగఢ్ టైగర్ రిజర్వ్‌లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన తవ్వకాల్లో ఒకప్పటి ఆధునిక సమాజం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇవి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితానివని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.
తవ్వకాల్లో బయల్పడిన వాటిలో చిత్రాలు, మానవ నిర్మిత జలాశయాలు కూడా ఉన్నాయి. బంధ్వాగఢ్ తాలా రేంజ్ పరిసరాల్లో మొట్టమొదటి సారి 1500 ఏళ్ల నాటి రాతి చిత్తరువును గుర్తించారు. ఇది చరిత్ర కాలానికి సంబంధించినది కాదని, సుమారు 1500 ఏళ్ల నాటిదని జబల్‌పూర్ సర్కిల్‌కు చెందిన సూపరింటెండిగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ శివకాంత్ బాజ్‌పాయ్ చెప్పారు. ఏదో ఒక జంతువును పోలినట్టు ఉన్న చిత్తరువును అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.
రాతి చిత్తరువు ప్రత్యేకతేంటి?
ఈ రాతి చిత్తరువును కొనుగొన్న గుహ కూడా విశిష్ఠమైనదని బాజ్‌పాయ్ చెప్పారు. ఈ గుహ స్వాభావికంగా ఏర్పడినది కాదని, దీనిని క్రమపద్ధతిలో తొలిచారని తెలిపారు.
అద్భుతమైన జలాశయాలు..
ఆనాటి కాలంలో ఈ ప్రాంతం అద్భుతమైన ఆధునిక సమాజం అనేందుకు అక్కడ వెలుగు చూసిన మానవ నిర్మిత జాలాశయాలు రుజువులుగా ఉన్నాయని బాజ్‌పాయ్ చెప్పారు. ఒకటో రెండో కాకుండా.. అసంఖ్యాక జలాశయాలు కనిపించాయని తెలిపారు. మంచి ఎత్తున, వర్షపు నీటిని సేకరించేందుకు అనువుగా వీటిని నిర్మించారని పేర్కొన్నారు. ఇవి సుమారు 1800-2000 సంవత్సరాల క్రితం నాటివని చెప్పారు.
దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం వాటిలో కొన్నింటిని పునరుద్ధరించినట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ తవ్వకాల్లో అనేక గుహలను కూడా కనుగొన్నారు. ఇదే ప్రాంతంలో 2022లో కూడా ఏఎస్‌ఐ సర్వే చేయగా.. వేల ఏళ్లక్రితం నాటి పలు నిర్మాణాలు, గుహలు కనిపించాయి.
ఇవి ప్రధానంగా బౌద్ధ, హిందూ ఆలయాలు, కట్టడాలుగా ఉన్నాయి. కానీ.. తాజాగా కనిపించిన గుహలు నివాస అవసరాల కోసం రాతిని తొలిచినట్టు ఉన్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు వాణిజ్య మార్గంగా ఉండేదని, ఈ దారి గుండా ప్రయాణించిన వ్యాపారులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారని భావిస్తున్నారు.
2022 తవ్వకాల సందర్భంగా వరాహ, మత్స్య అవతారాల్లో ఉన్న విష్ణుమూర్తి భారీ విగ్రహాలను కనుగొన్నారు. సహజసిద్ధ గుహల్లో కొన్ని బోర్డ్ గేమ్స్ కూడా బయల్పడ్డాయి. అంతేకాకుండా.. మధుర, కౌశంబి, పవత (పర్వత), వేజభరాడ, సెప్టనాయిరిక పురాతన నగరాల పేర్ల ప్రస్తావనలు కూడా అక్కడి శాసనాల్లో కనిపించాయి. ఆ సమయంలో ఈ ప్రాంతం శ్రీ భీమ్‌సేన, మహారాజ పోతసిరి, మహారాజ భట్టాదేవ వంటి రాజుల పాలనలో ఉండేది.