Maharashtra |
విధాత: జిమ్‌లో ఓ గొడవ కారణంగా నలభై మంది తమపై దాడికి పాల్పడ్డారని నలుగురు వ్యక్తులు ఫిర్యాదు చేసినట్లు మహారాష్ట్ర (Maharashtra)లోని పాల్ఘర్ పోలీసులు గురువారం వెల్లడించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇక్కడి కుడు గ్రామంలో బుధవారం ఉదయం బాధితుల్లోని ఓ వ్యక్తి వ్యాయామం చేసుకోవడానికి జిమ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో పొరపాటున డంబెల్ ను నేలపై పడేశాడు. దీనికి నిందితుల్లోని ఒక వ్యక్తి పెద్దగా అరుస్తూ.. అతడిని కులం పేరుతో దూషించాడు. అక్కడితో అది అయిపోగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
అనంతరం ఓ దుకాణం వద్దకు బాధితుడు అతడి స్నేహితులతో వెళ్లగా.. అక్కడికి వచ్చిన నిందితుల గుంపు బాధితులపై మూకుమ్మడి దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో 35 మంది ఎవరో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు