- 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై .. మరి కొన్ని గంటల్లో సుప్రీంకోర్టు తీర్పు
- యూకే పర్యటనకు వెళ్లిన మహా స్పీకర్.. అందుబాటులోలేని డిప్యూటీ స్పీకర్
విధాత: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శివసేనకు చెందిన 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది. కొన్ని నెలలుగా మహా సర్కారులో నెలకొన్న రాజకీయ పోరు సుప్రీం తీర్పుతో ఒక కొలిక్కి రానున్నది.
అయితే, కొన్ని గంటల్లో ధర్మాసనం తీర్పు ఇవ్వనున్న క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాలా గురువారం ఉదయం నుంచి అందుబాటులో లేకుండా పోయారు. మీడియా ఆయన ఫోన్‌కు ప్రయత్నించగా స్విచ్ఛ ఆఫ్ వచ్చింది. ఆయన తన గ్రామంలో కూడా లేదని సమాచారం. ఆయన నాసిక్‌లోని దిండోరిలో ఉన్నారని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్పందిస్తారని జిర్వాలా కార్యాలయం వెల్లడించింది.
అయితే, అసెంబ్లీ స్పీకర్ గురువారం తెల్లవారుజామునే యూకే బయలుదేరి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయనమీడియాతో మాట్లాడుతూ ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం యూకే వెళ్తున్నానని, తిరిగి వచ్చాక దీనినిపై స్పందిస్తానని చెప్పారు. చట్టసభల హక్కులకు భంగం కలిగించదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
2022 జూన్ లో ఏక్‌నాథ్ షిండే, అతని వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మూడు పార్టీల ఎంవీఏ ప్రభుత్వం పడిపోయింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఏక్‌నాథ్‌షిండేతోపాటు భరత్‌షేత్ గోగావాలే, సందీపన్‌రావ్ బుమ్రే, అబ్దుల్ సత్తార్, సంజయ్ శిర్సత్, యామినీ జాదవ్, అనిల్ బాబర్, బాలాజీ కినికర్, తానాజీ సావంత్, ప్రకాష్ సర్వే, మహేశ్ షిండే, లతా సోనావానే, చిమన్‌రావ్ పాటిల్, రమేశ్ బోర్నారే, సంజయ్ రాయ్ముల్కర్, బాలాజీ కళ్యాణ్‌కర్ ఉన్నారు.
9 నెలల విచారణ అనంతరం తీర్పు
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు
శాసనసభ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాలాకు పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఏకనాథ్ షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి స్టే విధించాలని కోరారు.
ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోలేమని ఏక్‌నాథ్ షిండే వర్గం తెలిపింది. దాదాపు 9 నెలలపాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. గురువారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనున్నది.
తీర్పు నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఏమన్నారంటే..
షిండే సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలు అనర్హతపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్ననేపథ్యంలో బుధవారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్‌ను మీడియా ప్రతినిధులు కలిశారు. ఒకవేళ ప్రతికూల తీర్పు వస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించగా.. ఈ చర్చకు అర్ధం లేదని ఆయన కొట్టిపడేశారు. షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.