విధాత: కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా సిబ్బందికి అనుకోని ఘటన ఎదురైంది. ఐదంచెల భద్రతా వలయాన్ని ఛేదించుకొని, ఓ యువకుడు పూలదండతో మోదీ వద్దకు దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని పక్కకు నెట్టేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. 29వ నేషనల్ యూత్ ఫెస్టివల్ వేడుకలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని హుబ్లీకి ఇవాళ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి రైల్వే స్పోర్ట్స్ స్టేడియం వరకు మోదీ రోడ్‌షో నిర్వహించారు. ఇక మోదీని చూసేందుకు భారీగా జనాలు తరలివచ్చారు. మోదీ కారు డోర్ వద్ద నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
పూలదండతో ప్రధాని వద్దకు దూసుకొచ్చిన యువకుడు pic.twitter.com/IgIuDuHWsF
— vidhaathanews (@vidhaathanews) January 12, 2023
అంతలోనే మోదీ కాన్వాయ్ వద్ద ఓ 15 ఏండ్ల యువకుడు పూలదండతో వేగంగా ముందుకు దూసుకొచ్చాడు. అతన్ని ఎస్పీజీ సిబ్బంది అడ్డుకోగా, యువకుడి చేతిలో ఉన్న పూలదండను మోదీ తీసుకుని, సిబ్బందికి ఇచ్చేశారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదంచెల భద్రత ఉన్నప్పటికీ, ఆ యువకుడు మోదీ వద్దకు ఎలా దూసుకొచ్చాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు