Kuki People’s Alliance |
విధాత : కుకీలు (Kuki People’s Alliance) మీటీలతో అదే రాష్ట్రంలో కలసి ఉండడం అసాధ్యమని కుకీ పీపుల్స్ అలయెన్స్ నేత విల్సన్ లాలమ్ హాంగ్‌షింగ్ స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కుకీలకు వ్యతిరేకి అని ఆయన ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో స్పష్టం చేశారు.
గత నాలుగైదేళ్లలో బీరేన్ సింగ్ ప్రవర్తనే మణిపూర్‌లో నేటి పరిస్థితికి కారణమని ఆయన అన్నారు. కుకీ అలయెన్స్ బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్న విషయం వాస్తవమే అయినా తమ మద్ధతు లేకుండా ప్రభుత్వాన్ని నిలుపుకునే సొంతబలం బీజేపీకి ఉందని హాంగ్‌షింగ్ అన్నారు.
తన ఇల్లు తగులబెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఫోను చేసినా బీరేన్ సింగ్ స్పందించలేదని ఆయన విమర్శించారు. మాకు ప్రత్యేక పాలన కావాలి. అలా అని స్వయంప్రతిపత్తి మండలికాదు. ప్రత్యేక రాష్ట్రమే కావాలి అని హాంగ్‌షింగ్ స్పష్టం చేశారు. హాంగ్‌షింగ్ కూడా బీజేపీ అనుకూల కుకీ నాయకుడే.