- నిందితుల్లో బీజేపీ నేత ఉండటంతోనే కేసు తప్పుదోవ..
విధాత : కొత్త సంవత్సరం వేళ ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ కంఝావాలా ప్రాంతంలో జరిగిందని చెప్తున్న రోడ్డు ప్రమాదం, అమ్మాయి విషాదకరమైన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల అమ్మాయి ఆదివారం తెల్లవారుజామున తన స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టిందని, ఆ ప్రమాదంలో అమ్మాయి కాలు కారు టైర్లలో చిక్కడంతో కారు ఆమెను కిలోమీటర్ల మేర ఈడ్చుకుపోయిందని, దాంతో ఆమె దుర్మరణం పాలైందని పోలీసులు అంటున్నారు.
చివరికి ఆమె శరీరం ఢిల్లీ శివారులోని జౌంతీ గ్రామ పరిసరాల్లో బట్టలు లేని స్థితిలో రోడ్డుపై పడి ఉన్నదని, స్థానికులు చూసి తెలియజేయడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెబుతున్నారు. ఇరవై ఏండ్ల తన కూతురే తమకు జీవనాధారమని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది.
తన బిడ్డ ఈవెంట్ వెల్కం గర్ల్‌గా పనిచేసేదని చెప్తూ.. కొత్త సంవత్సరం వేళ ఎక్కడికి వెళ్లిందో తెలియదని తల్లి వాపోయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా కారును కనుగొని కారులో ప్రయాణించిన ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నామని పోలీసులు చెబుతున్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందా ? లేక వారు తాగి ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు.
మౌలానా ఆజాద్ ఆస్పత్రిలో మృతురాలికి పోస్టుమార్టం జరిగింది. ముగ్గురు డాక్టర్ల బృందం పోస్టుమార్టం చేసింది. వారు ఇచ్చిన తాత్కాలిక పోస్ట్‌మార్టం రిపోర్టులో షాక్, అధిక రక్తస్రావం కారణంగా చనిపోయినట్లు తెలిపారు. అలాగే అమ్మాయిపై లైంగికదాడి జరిగిన ఆనవాళ్లేమీ లేవని పోస్ట్‌మార్టం రిపోర్టు తెలిపింది.
కానీ, యాక్సిడెంట్ జరిగిన తీరు, ఆమె శరీర స్థితిపై ఆమె తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. కారు ప్రమాదం జరిగితే, అమ్మాయి బట్టలు ఏమయ్యాయని తల్లి ప్రశ్నిస్తున్నది. ఇదిలా ఉంటే… పోలీసులు చెప్తున్న దాని ప్రకారం యాక్సిడెంట్ జరిగినప్పుడు స్కూటీపై మరో అమ్మాయి కూడా ఉన్నది. యాక్సిడెంట్లో ఆమెకు దెబ్బలేమీ తగల్లేదు. దాంతో ఆమె లేచి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఇది నమ్మశక్యమేనా..!
ఇంతపెద్ద యాక్సిడెంట్ జరిగితే.. ఒకరికి ఏమాత్రం దెబ్బలు తగలకుండా ఉండటం సాధ్యమేనా? స్నేహితురాలికి ప్రమాదం జరిగినా పట్టించుకోకుండా ఎందుకు అలా వెళ్లిపోయింది? ప్రమాదమే అయితే మృతురాలి ఒంటిపై బట్టలు ఎందుకు లేవు? పూర్తిగా నగ్నంగా రోడ్డుపై ఎలా పడి ఉంటుంది? అని స్థానికులు అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అరెస్టు అయిన వారంతా మృతురాలు ఉన్న మంగోల్‌పురి ప్రాంత వాసులే కావడం గమనార్హం. నిందితు లంతా 25నుంచి 30 ఏండ్ల లోపు వారే. వారంతా చిన్న చిన్న పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఇందులో మనోజ్మిట్టల్ అనే బీజేపీ కార్యకర్త కూడా ఉన్నారు. ఇతను ఓ రేషన్‌షాపు డీలర్. సుల్తాన్‌పురి, మంగోల్ పురి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలు కనపిస్తాయని అంటున్నారు. సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్‌కు మనోజ్మిట్టల్ ఫొటో ఉన్న ఫ్లెక్సీని స్థానికులు చింపివేశారు.
పలుకుబడి ఉన్న బీజేపీ కార్యకర్త అయినందున జరిగిన ఘటనను చిన్నదిగా చేయడం కోసం యాక్సిడెంట్ కేసుగా నమ్మబలుకుతున్నా రని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. బీజేపీ నేతల జోక్యంతోనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తు న్నారు. ఇలా ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నా పోలీసులు మాత్రం యాక్సిడెంట్ కేసుగానే చెప్పుకొస్తున్నారు