జైలు నుంచి ఇంటికి చేరిన మావోయిస్టు నేత గజ్జల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న విధాత: చదువుకుంటానని హైదరాబాద్‌కు వెళ్లి రాడికల్ ఉద్యమంతో ఏర్పడిన పరిచయంతో పీపుల్స్ వార్ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిన గజ్జల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న 43 ఏళ్ల త‌ర్వాత‌ సొంతూరుకు చేరుకోవడం సంచలనగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన సత్యం రెడ్డి ఆదివారం తన స్వగ్రామానికి చేరుకోగా ఇన్నాళ్లకు స్వగ్రామాన్ని, కన్నవారిని, కుటుంబ […]

  • జైలు నుంచి ఇంటికి చేరిన మావోయిస్టు నేత గజ్జల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న

విధాత: చదువుకుంటానని హైదరాబాద్‌కు వెళ్లి రాడికల్ ఉద్యమంతో ఏర్పడిన పరిచయంతో పీపుల్స్ వార్ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిన గజ్జల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న 43 ఏళ్ల త‌ర్వాత‌ సొంతూరుకు చేరుకోవడం సంచలనగా మారింది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన సత్యం రెడ్డి ఆదివారం తన స్వగ్రామానికి చేరుకోగా ఇన్నాళ్లకు స్వగ్రామాన్ని, కన్నవారిని, కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ సొంత ఇంటికి చేరిన ఆయనను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

మావోయిస్టు పార్టీ దండకారణ్య విస్తరణ కమిటీలో కీలక భూమిక వహించి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన గజ్జల సత్యం రెడ్డి పై పోలీసులు మోపిన అన్ని కేసులను కోర్టులు కొట్టివేయడంతో చత్తీస్ ఘడ్ రాష్ట్రం రాయపూర్ జైలు నుండి విడుదలవ్వగా, తన స్థానిక ప్రజల సహకారంతో తనను తీసుకెళ్లేందుకు వచ్చిన తమ్ముడితో కలిసి ఎట్టకేలకు స్వగ్రామం సుబ్బారెడ్డి గూడేనికి చేరుకున్నాడు.

43 ఏళ్ల అనంతరం సొంతూరుకు, ఇంటికు చేరుకున్న సత్యం రెడ్డిని గ్రామస్తులు తొలుత పోల్చుకోలేకపోయినా నెమ్మదిగా గుర్తుపట్టి ఇక రాడేమో అనుకున్న తమ వాడిని కళ్లారా చూసుకొని ఆనంద భాష్పాలు రాల్చారు.

ఈ సందర్భంగా సత్యం రెడ్డి తను పుట్టి పెరిగిన ఊరంతటిని సందర్శించి చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి తిరుగుతూ, పెద్దల్ని కలిసి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

గ్రామస్తులతో కలిసి ఊరంతా తిరిగిన సత్యం తన కన్నవారిని మాత్రం కళ్లారా చూసుకోలేకపోయాడు. తాను జైల్లో ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు మరణించడంతో వారిని కడసారి చూపు చూసుకోలేకపోయానని సత్యం రెడ్డి ఆవేదన చెందారు. అయితే తన అన్నను, తమ్ముడిని, వారి కుటుంబ సభ్యులను తిరిగి కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.

43 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో 26 ఏళ్లు అడవిలో..17 ఏళ్లు జైలులో..

హైదరాబాద్ ఏవీ కళాశాలలో ఇంటర్, ఆ త‌రువాత డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై 1980వ‌ సంవత్సరం ఆగస్టులో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన గజ్జల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు పని చేశారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు నల్ల ఆదిరెడ్డికి కుడి భుజంగా పనిచేస్తున్న క్రమంలో పలు ఎన్ కౌంటర్ల నుండి సత్యం రెడ్డి తృటిలో తప్పించుకున్నప్పటికీ 2006లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

సత్యం రెడ్డి పై చత్తీస్ ఘడ్ పోలీసుల పలు కేసులు మోపి రాయపూర్ జైల్లో నిర్బంధించారు. తనపై మోపిన పోలీస్ కేసులను కోర్టులు ఒక్కొక్కటిగా కొట్టివేస్తున్నప్పటికీ మరో కేసులో ఉన్నాడంటూ వరుస అరెస్టులు చేస్తూ పోలీసులు సత్యం రెడ్డిని నిరంతరంగా జైల్లో పెడుతూ వచ్చారు.

తన అన్నను విడిపించేందుకు బెయిల్ కోసం సత్యం రెడ్డి తమ్ముడు చేసిన ప్రయత్నాలను ఇన్నాళ్లుగా పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకోవడంలో సఫలీకృతమయ్యారు. దీంతో 17 ఏళ్ల పాటు సత్యం రెడ్డి జైల్లోనే మగ్గిపోయారు.

తాజాగా చివరి కేసును కోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో సత్యం రెడ్డి జైలు నుంచి విడుదలైన వెంటనే అక్కడికి వెళ్లిన తన తమ్ముడితో కలిసి స్థానిక ప్రజల సహకారంతో స్వగ్రామం మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం చేరుకొని కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది.

జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోనే..

అజ్ఞాతంలో ఉండగానే సత్యం రెడ్డి తోటి పార్టీ సభ్యురాలని వివాహం చేసుకోగా ఆమె ఎన్ కౌంటర్ లో మరణించింది. అనంతరం ద్వితీయ వివాహం చేసుకున్నప్పటికీ ఆమె వివరాలు తెలియ రాలేదు. స్వగ్రామానికి చేరుకున్న సత్యం రెడ్డిని చూసేందుకు గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆసక్తిగా తరలి రావడం విశేషం.

కుటుంబ సభ్యులను కలుసుకున్న వేళ భావోద్వేగాపూరిత వాతావరణంతో అంతా కంటతడి పెట్టారు. విద్యార్థి దశ నుండి 43 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ విప్లవోద్యమంలో భాగమైన సత్యం రెడ్డి ఇక మీదట తను జనజీవన స్రవంతిలోనే కొనసాగుతానని, తిరిగి మావోయిస్టు పార్టీలోకి వెళ్లేది లేదంటూ చెప్పడం జరిగింది.

Updated On 28 March 2023 5:18 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story