- అది మా జీవన శైలిలో భాగం
- ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం!
విధాత : పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గొడ్డు మాంసం తినడం, ఎద్దులను రవాణా చేయడం నేరాలైపోయిన నేపథ్యంలో మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ (BJP State Chief Ernest Mawrie) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరి ఆహార అలవాట్లను మరొకరు నిర్దేశించజాలరని అన్నారు. మేఘాలయలో గొడ్డు మాంసం తినడం (beef eating) పై ఎలాంటి ఆంక్షలు లేవని మావ్రీ చెప్పారు. తాను కూడా గొడ్డు మాంసం తింటానని తెలిపారు.
గురువారం ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, ‘ ఇతర రాష్ట్రాల్లో బీఫ్ తినడంపై చేసిన చట్టాలపై నేనేమీ స్టేట్‌మెంట్ ఇవ్వబోవడం లేదు. మేం మేఘాలయలో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ బీఫ్ తింటారు. దానిపై ఎలాంటి ఆంక్షలు లేవు. అవును.. నేను కూడా బీఫ్ తింటాను. దానిపై మేఘాలయలో నిషేధం లేదు. ఇది ఇక్కడి ప్రజల జీవన శైలి. దాన్నెవరూ ఆపలేరు’ అని వ్యాఖ్యానించారు. దేశంలో కూడా అలాంటి నిబంధన ఏదీ లేదని అన్నారు.
విచిత్రం ఏమిటంటే మేఘాలయకు పొరుగునే ఉన్న బీజేపీ పాలిత అస్సాం.. పశువధ, రవాణా, బీఫ్ అమ్మకాలను నియంత్రిస్తూ చట్టం చేసిన సమయంలో మేఘాలయ (Meghalaya) బీజేపీ చీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నెల 27న మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.