విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాయా యుద్ధం చేసి గెలిచిందని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శంచారు. శనివారం భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా దేశవ్యాప్తంగా నిర్వహించిన మహా లైవ్ మీటింగ్‌కి మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.
అనంతరం మునుగోడు నియోజకవర్గ స్థాయి బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో రాచరికపు పాలన అంతం కావాలంటే అది కేవలం బీజేపీ తోనే సాధ్యమన్నారు.
మునుగోడులో నైతికంగా బీజేపీ గెలిచిందని, అయితే ప్రజలు బిజెపిని గెలిపించి ఉంటే భారత రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించేవారని రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే వారని అన్నారు. ఓటమి భయం తో మంత్రులు, ఎమ్మెల్యేలు వంద మందిని పెట్టి ప్రజలను బెదిరించి ప్రలోభాలు పెట్టి బిఆరెస్ పార్టీ గెలిచిందన్నారు.
ఐదు వేల మంది ఇంటలిజెన్స్ పోలీసులతో పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం మనల్ని ఓడగొట్టడానికి పనిచేసారన్నారు. పోలీసులు మా అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారని, పోలీసుల తో
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొందన్నారు.
యావత్ దేశం మొత్తం మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకోవడం తనకు గర్వకారణం అన్నారు. ప్రజాస్వామ్యం కాపాడాలని పని చేసిన ప్రతీ కార్యకర్తకు రుణపడి ఉంటానన్నారు. ఓటమి పాలైనా బాధగా లేదని, గెలిస్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ మారేది. అలా జరుగనందుకు బాధగా ఉందన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక నా మీద విషప్రచారం చేశారని, ప్రచారం చేయనీయకుండా అడుగడుగునా దుర్మార్గంగా నన్ను అడ్డుకున్నారని, బీజేపీ కార్యకర్తల పై దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
మూడు నెలలు కేసీఆర్ కౌరవ సైన్యాన్ని నిద్రపోనియకుండా మునుగొడులో తిప్పామన్నారు.
దేశం లో ఉత్కంఠ రేపిన ఎన్నికగా మునుగోడు ఉపఎన్నిక నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరించలేని సీఎం కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తాడంటే జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా తెరలేపిండని దుయ్యబట్టారు.
బీజేపీ మద్యం కుంభకోణం వెలికితీసిందన్న ద్వేషంతో కేసీఆర్ కుటుంబం జైలుకు పోతామనే భయంతోనే బీఆరెస్ పార్టీ పెట్టిండని, బిఆర్ఎస్ అంతా ఒక డ్రామాగా నడిపిస్తున్నాడని విమర్శించారు.
మొన్న హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మునుగోడు గురించి ప్రశంసించారని, బిజెపి పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా కట్టుబడి పనిచేస్తానని, పదవుల కోసం కాదు మునుగోడు ప్రజలకోసం పనిచేస్తానన్నారు.
కార్యక్రమం లో మునుగోడు నియోజకవర్గ పాలక్ చాడ సురేష్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ప్రభారీ అంజయ్య యాదవ్, మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, నియోజకవర్గ వ్యాప్త బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు భారీగా పాల్గొన్నారు..