Medak రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా మంత్రి హరీష్, ఎమ్మెల్యే పద్మకు వ్యతిరేకంగా నినాదాలు విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెడికల్ కళాశాల ప్రారంభం, అభివృద్ధిలో మంత్రి హరీష్ రావు వివక్షకు నిరసనగా గురువారం మెదక్ లో కాంగ్రెస్ చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, పలువురు కార్యకర్తలను నిర్బంధించారు. పీసీసీ నాయకుడు మ్యాడమ్ బాలకృష్ణ అధ్వర్యంలో ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మెదక్ రాందాస్ చౌరస్తాకు తరలివచ్చారు. ప్రభుత్వ […]

Medak
- రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
- మంత్రి హరీష్, ఎమ్మెల్యే పద్మకు వ్యతిరేకంగా నినాదాలు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెడికల్ కళాశాల ప్రారంభం, అభివృద్ధిలో మంత్రి హరీష్ రావు వివక్షకు నిరసనగా గురువారం మెదక్ లో కాంగ్రెస్ చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, పలువురు కార్యకర్తలను నిర్బంధించారు. పీసీసీ నాయకుడు మ్యాడమ్ బాలకృష్ణ అధ్వర్యంలో ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మెదక్ రాందాస్ చౌరస్తాకు తరలివచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో డీఎస్పీ ఫణీంద్ర అధ్వర్యంలో పోలీస్ లు బాలకృష్ణను అరెస్ట్ చేసి, రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న నిరసనకారులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. మెదక్-రామాయంపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పీసీసీ కార్యదర్శి సుప్రభాత రావును రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టౌన్ సీఐ వెంకటేష్ బలవంతంగా రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కళాశాల ప్రారంభించాలని కోరారు.
మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలు మెదక్ అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాల మంజూరైందన్న ఆనందంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినా ప్రారంభం కాలేదన్నారు. మెదక్ నుంచి జింకల పార్కును సైతం సిద్దిపేటకు తరలించారని, ఒక్కో కార్యాలయాన్ని సిద్దిపేట లోనే ఉంచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నిరసనలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.
అబద్దాలకోరు మంత్రి హరీష్: పీసీసీ కార్యదర్శి మ్యాడమ్ బాలకృష్ణ
మంత్రి హరీష్ రావు అబద్దాలకోరు అని పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడమ్ బాలకృష్ణ ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కళాశాల తరగతుల ప్రారంభించాలని డిమాండ్ చేశారు.18 కార్యాలయాలు సిద్దిపేట కు తరలి వెళ్లాయన్నారు. బంద్ కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
