HomelatestMedak | చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

Medak | చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

Medak

  • జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

విధాత, మెదక్ బ్యూరో: ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పంట విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి కూడా బాగా వస్తున్నదని, అయినా రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

బుధవారం సచివాలయం నుండి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌర సరఫరాల కమిషనర్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు, అధికారులు తీసుకున్న చర్యల కారణంగా గత సంవత్సరం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

గత సంవత్సరంలో 4.5 లక్షల రైతుల నుంచి 28 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం మే 23 నాటికి 6.4 లక్షల రైతుల నుంచి 38 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. గత సంవత్సరం కంటే అధికంగా 450 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని మంత్రి తెలిపారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం రైతులు నష్ట పోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడికి స్థల సమస్య ఉందని, దీనివల్ల లారీల మూమెంట్, మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి ఆలస్యం అవుతుందని, దీనిని నివారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని,అట్టి ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోడౌన్లో భద్రపరచాలని మంత్రి ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద లోడింగ్, అన్లోడింగ్ సమస్య రాకుండా అధిక సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాల వారీగా అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణతో పాటు అటు భారత ఆహార సంస్థకు ఈ నెలాఖరు వరకు ఉన్న గడవు లోగా పెండింగ్ సి.ఏం.ఆర్. రైస్ ను తరలిస్తున్నామ‌న్నారు. రెండు ఏకకాలంలో చేస్తుండడంవల్ల కాస్త జాప్యం అవుతున్నద‌న్నారు.

జిల్లా యంత్రాంగాన్ని యావత్తు అప్రమత్తం చేసి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేశామని ఇప్పటి వరకు జిల్లాలో ఒక లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మూతపడిన అల్యూమినియం ఫ్యాక్టరీ, ఖండసారి షుగర్ ఫ్యాక్టరీలలో 31 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆన్ లోడ్ చేసి భద్రపరిచామని అన్నారు. రైస్ మిల్లులే కాకుండా అన్ని ప్రైవేట్ గోదాములలో ధాన్యం భద్రపరుస్తున్నామని, స్థలాభావం వల్ల ఓపెన్ ప్లేస్ లో కూడా ధాన్యం స్టోర్ చేసి టార్పాలిన్ కప్పుతున్నామని అన్నారు.

గత సీజను లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం గద్వాల జిల్లాకు తరలించగా, ఈ సీజనులో ఇక్కడే తీసుకుంటుండం వల్ల స్థలాభావ సమస్య ఏర్పడుతున్నదని అన్నారు. సంగారెడ్డి జిల్లాకు 10 వేల మెట్రిక్ టన్నులు తరలించుటకు అనుమతి వచ్చినదని, మరో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా తరలించి గోదాములలో భద్రపర్చుటకు అనుమతించవలసినదిగా మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మండల ప్రత్యేకాధికారులు, ఆర్.డి.ఓ.లు, తహసీల్ధార్లు అందరు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గన్ని సంచులు, లారీల కొరత రాకుండా చూస్తున్నారని, ఎక్కడైనా ఇబ్బందైతే వెంటనే రెవిన్యూ, పోలీసు, రవాణా శాఖ అధికారుల బృందం లారీలను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. ధాన్యం సేకరణ వరకు అదనంగా ఒక మోటార్ వెహిల్స్ ఇన్స్పెక్టర్ ను ఇస్తూ మరో వంద లారీలు ఏర్పాటు చేయవలసినదిగా మంత్రికి విన్నవించారు.

తూకం లోగాని, రవాణాలో గాని ఇబ్బందులైతే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ పక్షం రోజులు కూడా జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి రోజు కొనుగోళ్లు ఆగకుండా, రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా ఆదేశించామన్నారు. ధాన్యం ప్రక్రియ సజావుగా జరిగేలా అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నార‌ని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్, డిఆర్ డిఓ శ్రీనివాస్, డీఎస్ ఓ శ్రీనివాస్, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా సహకార అధికారి కరుణ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular