Medico Preethi | వరంగల్ కాకతీయ వైద్యశాల కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థిని ప్రీతి సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎంలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో వేధింపులు భరించలేక హానికరమైన ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకుయత్నించింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతికి ఎంజీఎంలో చికిత్స అందించగా.. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు.
గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సైతం మెడికో ప్రీతి మృతిపై విచారం వ్యక్తం చేశారు. మృతికి సంతాపం తెలిపిన ఆయన.. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందని, ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు.
విద్యార్థిని ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం పట్టించుకొని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని, ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మరణించిందన్నారు. కేసీఆర్ ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించేంత వరకు తాము పోరాడతామన్నారు. భవిష్యత్తులో ప్రీతి లాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రీతి ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫర్వాలేదని స్పందించలేదా? అని ప్రశ్నించారు. మీరిచ్చే 10లక్షల రూపాయల సాయం, ఆ తల్లిదండ్రుల గుండె కోత చల్లార్చుతుందా?.. బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరుపిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
ఈ ఘటనపై ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? గిరిజన విద్యార్థిని కాబట్టి,ఏమైనా ఫరవాలేదనే స్పందించలేదా? మీరిచ్చే 10లక్షల రూపాయల సాయం,ఆ తల్లిదండ్రుల గుండె కోత చల్లార్చుతుందా?
కేసీఆర్ పాలనలో బిఆర్ఎస్,ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 26, 2023