Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో పిల్లర్ కూలిపోవడంతో తల్లి, ఆమె పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో భర్త తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన భార్య, రెండున్నరేండ్ల పసిబిడ్డతో కలిసి బైక్పై బయల్దేరాడు. కల్యాణ్ నగర్ నుంచి హెచ్ఆర్బీఆర్ లే అవుట్ మధ్య మెట్రో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నాగవరా ఏరియా వద్ద భార్య, పసిబిడ్డతో వెళ్తున్న అతని బైక్పై నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న అతనికి తీవ్ర గాయాలు కాగా, భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మృతులను తేజస్వి(25), కుమారుడు విహాన్గా గుర్తించారు. భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ ప్రమాద ఘటనపై డీసీపీ భీమశంకర్ ఎస్ గులేడ్ స్పందించారు. బాధితుడు తన భార్య, కుమారుడితో కలిసి బైక్పై హెబ్బల్ వైపు వెళ్తుండగా, మెట్రో పిల్లర్ కూలిందన్నారు. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురిలో ఇద్దరు చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.