Middle Class | ‘తలసరి’ పేరిట తలా కాస్త పంచేస్తున్న ప్రభుత్వం అది అందరి ఆదాయంగా చెబుతూ భ్రమలు ఆదాయం పెరుగుదల కొందరికే.. ధరల మాత్రం పెరుగుదల అందరికీ బాగా ప్రభావితమవుతున్నది పేద ప్రజలే విధాత: దేశంలోనే తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్‌ వన్‌ అని, ముంబై మహానగరం కన్నా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం గొప్పగా పెరిగిందని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం.. పెరిగిన ఆదాయం సాధారణ ప్రజలది కాదని, ఇది కొంత మంది బడా బాబులదేనని […]

Middle Class |

  • ‘తలసరి’ పేరిట తలా కాస్త పంచేస్తున్న ప్రభుత్వం
  • అది అందరి ఆదాయంగా చెబుతూ భ్రమలు
  • ఆదాయం పెరుగుదల కొందరికే..
  • ధరల మాత్రం పెరుగుదల అందరికీ
  • బాగా ప్రభావితమవుతున్నది పేద ప్రజలే

విధాత: దేశంలోనే తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్‌ వన్‌ అని, ముంబై మహానగరం కన్నా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం గొప్పగా పెరిగిందని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం.. పెరిగిన ఆదాయం సాధారణ ప్రజలది కాదని, ఇది కొంత మంది బడా బాబులదేనని గుర్తించడానికి నిరాకరిస్తుదా? ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతున్నా… పట్టించుకోలేక పోతున్నదా? ధరలు పెరుగుతున్నా… ఆదాయం పెరిగింది కదా అని సర్ది చెబుతున్నదా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదాయం కొంత మందికే పెరిగిందని, కానీ ధరల పెరుగుదల అందరికీ తగిలిందని పాలకులు గుర్తించ నిరాకరిస్తున్నారని పేర్కొంటున్నారు.

సంపద కొద్ది మందిదే

తలసరి ఆదాయం లెక్కలే మోసపూరితమని విశ్లేషకులు చెబుతున్నారు. పది మంది సంపన్నుల సంపద అందరిదీ కాదని గుర్తుచేస్తున్నారు. ‘పెద్దలది పేదలకు రాదు.. పేదలది పెద్దలకు రాదు. ఈ పేదరికం అలాగే ఉన్నా.. చాలా గొప్పగా సాధించామని చెప్పుకుంటున్నారు’ అని ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ తెలిపారు.

రాష్ట్రంలో కుబేరులు పెరిగిపోతూ, పేదరికం అంతకు మించిన స్థాయిలో పెరిగిపోతున్నదని తేల్చి చెప్పారు. ఈ అంతరాన్ని గుర్తించకుండా తలసరి ఆదాయం పెరిగిందని సంతోషపడితే మధ్యతరగతి, పేదల జీవితం చాలా దుర్భరంగా తయారయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

తలసరి ఆదాయం లెక్కింపు ఇలా..

ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తయిన అన్ని వస్తువులు, సేవల విలువను పౌరులందరికీ సమానంగా విభజించిన తరువాత వచ్చిన ఆదాయమే తలసరి ఆదాయం. దీని ప్రకారంగా రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారాలు, సేవలతో ప్రతి పని ద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని లెక్కించి, భాగించిన తరువాత వచ్చిన అంకెను తలసరి ఆదాయం కింద చూపిస్తారు. కానీ అందరు సంపాదించిన సంపదను ఒకే దగ్గర వేసి పంపిణీ చేయరని అన్నారు. అలా పంపిణీ చేసే అవకాశం లేని వ్యవస్థలో సరాసరిని లెక్కించడం ఎలా సరైనదని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.17 లక్షలు. ఇది దేశ తలసరి ఆదాయం రూ.1.71 లక్షల కంటే చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతున్నది. కానీ మన రాష్ట్రంలో పేదలు ఏడాదికి లక్ష రూపాయలు కూడా సంపాదించలేని వారు అనేక మంది ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. రోజుకు 150 నుంచి 200 వేతనాలకే పని చేస్తున్న దినసరి కూలీలు కోకొల్లలు. వీరందరికీ ఏడాది పొడుగునా పని దొరకడం కష్టమే.

పెరుగుతున్న సంపన్నులు

మహానగరంగా విస్తరించిన హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులున్న నగరాల జాబితాలో 65వ స్థానం సంపాదించుకుంది. నగరంలో 11,100 మంది కోటీశ్వర్లు ఉన్నట్లు హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ నివేదిక తెలిపింది. 2012-22 మధ్య అత్యధిక నికర సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగినట్లు చెప్పింది. బహుశా వీరి ఆదాయం వల్లే తలసరి ఆదాయం బాగా పెరిగినట్లు మనకు కనిపిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

హన్మకొండలో అతి తక్కువ తలసరి ఆదాయం

తెలంగాణ తలసరి ఆదాయాన్ని జిల్లాల వారీగా పరిశీలిస్తే హన్మకొండ జిల్లా తలసరి ఆదాయం రూ.1,30,821గా నమోదైంది. రాష్ట్రంలో రూ.1.50 లక్షల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న జిల్లాలు హన్మకొండ, హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న వికారాబాద్‌ జిల్లా (ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగం)తో పాటు మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి.

రూ.2 లక్షల లోపు ఆదాయం 13 జిల్లాల్లో ఉన్నది. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న జిల్లాలు 8 కాగా, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్నదని 2013 తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఔట్‌లుక్‌ సర్వే తెలియజేస్తున్నది. పేదరికం సూచీని పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు తరువాత స్థానంలో తెలంగాణ ఉన్నది.

ధరలతో పేదలు విలవిల

రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. వీరంతా పెరిగిన ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సగటు వేతన జీవులు అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నెలరోజులకు ఒకసారి పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలకు అంతు లేకుండా పోతున్నది.

పెరిగిన ధరల సూచీ ప్రకారం వేతనాలు కానీ, ఆదాయాలు కానీ పెరిగే పరిస్థితి లేదు. పైగా కొవిడ్‌ సమయంలో అనేక సంస్థలు ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. వీరంతా నిరుద్యోగుల ఖాతాలో పడ్డారు.

దేశంలోనూ పెరిగిన నిరుద్యోగం

దేశవ్యాప్తంగా నిరుద్యోగం బాగా పెరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి దేశంలో నిరుద్యోగుల శాతం 5.44 ఉండగా, 2023 జూలై నాటికి 7.95 శాతానికి పెరిగినట్లు ఒక అధ్యయనం తెలిపింది. తెలంగాణలో డిసెంబర్‌ 22 నాటికి 4.1 శాతం నిరుద్యోగం ఉన్నట్లు చెపుతున్నది. 2019-21 మధ్య కాలంలో తెలంగాణలో పేదరికం 5.88 శాతానికి తగ్గినట్లు చెపుతున్నారు.

కానీ ఈ లెక్కలను పరిశీలిస్తే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల లెక్కలు కలిపి ఇస్తున్నారని అర్థమవుతున్నది. వాస్తవంగా కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా (16.59%), గద్వాల (15.37%), వికారాబాద్‌ (12.5%), కామారెడ్డి (11.9%), మహబూబ్‌నగర్‌లో (10.27%) పేదరికం ఎక్కువగా ఉన్నట్లు నీతి ఆయోగ్‌ లెక్కలు పేర్కొంటున్నయి. అయితే వాస్తవ లెక్కలు ఇంతకంటే ఎక్కువే ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

పథకాలకు దరఖాస్తులే పేదల సంఖ్యను చెబుతాయి

ముఖ్యంగా పేదరికపు సూచీ లెక్కలతోపాటు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతున్నదని నిపుణులు చెపుతున్నారు. రాష్ర్టంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు విపరీతంగా దరఖాస్తులు వచ్చాయి. ఇదే తీరుగా సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేని వారికి ఆర్థిక సహాయం చేయడం కోసం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులకు మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చినా దాదాపు 17 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలుస్తున్నది.

ఆర్థికంగా వెనుకబడిన బీసీ కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయం అందించడం కోసం తీసుకు వచ్చిన బీసీ బంధు పథకానికి 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాక దళితులు, గిరిజనులు, ఆదివాసీల పరిస్థితి చెప్పనక్కరలేదు. రాష్ట్రంలో 1.04 కోట్ల కుటుంబాలుంటే ప్రభుత్వం ఇచ్చే బియ్యం పథకం కింద ఉచిత బియ్యం తీసుకోవడానికి 90 లక్షల కుటుంబాలు రేషన్‌ కార్డులు తీసుకున్నాయి.

ఇందులో అనర్హుల కింద 20 లక్షల కార్డులు తీసి వేశారు. వివిధ ఫిర్యాదుల కారణంగా మరో 2 లక్షలు పునరుద్ధరించారు. తాజాగా రేషన్‌ కార్డులు కావాలని మరో 4,46,169 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులను క్లియర్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా తెలంగాణలో వివిధ వర్గాల నుంచి ప్రభుత్వ సహాయం కోసం వచ్చిన దరఖాస్తులే పేదరికం ఎలా ఉందో తెలియజేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

సంఖ్య పెరిగిన మధ్యతరగతి

మధ్యతరగతి ప్రజల సంఖ్య కూడా పెరిగిందన్న అభిప్రాయం వెలువడుతోంది. కరోనా తరువాత మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి కూడా చాలా పడిపోయిందంటున్నారు. దీంతో అనేక మంది మధ్యతరగతి ప్రజలు గృహాల కొనుగోళ్లకు ఈఐఎంల కింద తీసుకున్న బ్యాంకు రుణాల నెలసరి వాయిదాలు చెల్లించలేక పోతున్నారని బ్యాంకర్లే చెబుతున్నారు. రుణాలను నెలసరి వాయిదాల్లో తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని, కొంత మంది సంపాదించుకున్న స్థిరాస్తులు కూడా అమ్ముకుంటున్నారని అంటున్నారు.

ఇంటి బడ్జెట్‌ కష్టంగా మారింది

నిత్యావసరాల ధరల పెరుగుదల ధాటికి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆచితూచి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఇంటి బడ్జెట్‌ ప్రతి నెల 10 శాతానికి పైగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు నిలకడగా ఉండడం లేదని, ఫలితంగా ప్రతి నెల ఇంటి బడ్జెట్‌ నిర్వహణ ఇబ్బంది కరంగా మారుతుందని ఒక గృహిణి తెలిపారు.

దవాఖానల ఖర్చు వచ్చిందంటే చాలు ఏదో ఒక ఆస్తి అమ్ముకోవాల్సిన పరిస్థితేనంటున్నారు. పిల్లల స్కూల్‌ ఫీజులు భారంగా ఉన్నాయని, అయినా వచ్చిన దాంతో సర్దుకోవాల్సి వస్తున్నదని, దీంతో అనేక ఖర్చులు వాయిదా వేసుకుంటున్నామని మరొక గృహిణి తెలిపారు.

నిత్యవసర వస్తువులు 2014లో ఉన్న రేట్లతో ఇప్పుడు ఉన్న రేట్లను ఒకసారి పరిశీలించినట్లయితే?

S.No సరుకు 2014లో 2023లో
1 సోనా మసూరి బియ్యం 23 55
2 గోధుమలు 27 42
3 జొన్నలు 25 110
4 కందిపప్పు 80 160
5 పెసరపప్పు 105 120
6 శనగపప్పు 90 180
7 మినపపప్పు 46 70
8 పల్లి నూనె 90 180
9 సన్ ఫ్లవర్ ఆయిల్ 75 120
10 ఎండుమిర్చి 85 250
11 చింతపండు 80 150
12 చక్కెర 29 42
13 పెట్రోల్ 72 110

సరుకులు కొనాలంటే వణుకుపుడుతున్నది. మార్కెట్లో ధరలను చూస్తే ఏడుపు వస్తున్నది.
పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇంటికి సరిపోను సరుకులు కొనలేక అప్పులు చేయడమో, అర్ధాకలితో ఉండటమో చేయాల్సి వస్తున్నది. సామాన్యుల గురించి ఆలోచించని ప్రభుత్వం ఎందుకు? గతంలో నిత్యావసర వస్తువులను నెలకు సరిపడా ఒకేసారి కొని తెచ్చుకునేటోళ్లం.

ఇప్పుడు ఒకేసారి కొనలేక పోతున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. పేద, మధ్య తరగతి ప్రజలం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. రోజు వారీ ఆదాయం కుటుంబపోషణకు సరిపోక అప్పుల పాలవుతున్నాం. కేంద్రం నిత్యావసర సరుకుల ధరలు పెంచడమే పనిగా పెట్టుకున్నది. పేదల గురించి పట్టింపులేదు.

తొగిటి రాజసులోచన, గృహిణి, రామన్నపేట, వరంగల్

రోజురోజుకూ నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంట్లో వంటలు చేయడం ఇబ్బందిగా మారుతున్నది. ఇలాగే రేట్లు పెరిగితే కూరగాయలు కొనడం కూడా గగనంగా మారుతున్నది. పదేళ్ల క్రితం 100 రూపాయలు పట్టుకుని కూరగాయల మార్కెట్‌కి వెళితే నాలుగైదు రకాల కూరగాయలు వచ్చేవి. నేడు రూ.500లు కూరగాయల మార్కెట్ కు తీసుకెళ్తే వారానికి సరిపడే కూరగాయాలు కూడా రావడం లేదు.

కిరాణా సరుకులు గతంలో తక్కువ ఉండేవి. ఇప్పుడు కిలో పప్పు దినుసులు కొనాలంటే వంద రూపాయల నుండి 200 రూపాయలు పలుకుతున్నాయి. సబ్బులు తదితర కాస్మెటిక్స్ సైతం మూడింతల రేట్లు పెరిగాయి. నాయకులు నిత్యవసర వస్తువుల ధరల విషయంలో ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షణ వేస్తూ ధరలను నియంత్రించాలి. -పింగిళి వెంకటమ్మ, మంచిర్యాల

Updated On 12 Sep 2023 1:00 AM GMT
somu

somu

Next Story