- నెలనెలా పెరుగుతూ పోతున్న రేట్లు
- కిలో పెరుగు రూ.20 వరకు ప్రియం
విధాత: మార్కెట్‌లో పాలు (MILK), పెరుగు (CURD) ధరలు పరుగులు పెడుతున్నాయి. నెలనెలా (MONTHLY) పెరుగుతూ వినియోగదారులపై మరింత భారం మోపుతున్నాయి. గత ఆరు నెలల కాలంలో లీటర్ పాల ధర రూ.8 వరకు పెరగగా, కిలో పెరుగు ధర ఏకంగా 20 ఎగబాకడం గమనార్హం. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయిప్పుడు.
తగ్గిన పశు సంపద
ఒకప్పటితో పోల్చితే అటు ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH), ఇటు తెలంగాణ (TELANGANA)ల్లో పశు సంపద తగ్గిందనే చెప్తున్నారు పాడి పరిశ్రమ నిపుణులు. పెరిగిన పాల ఉత్పత్తి వ్యయం కూడా రైతులను పరిశ్రమకు దూరం చేస్తున్నదని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వారు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదలకు ఇది కూడా ఓ కారణమేనంటున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా వ్యయాన్ని పెంచుతున్నాయని గుర్తుచేస్తున్నారు.
మరోవైపు కరోనా సమయంలో వచ్చిపడిన లాక్‌డౌన్లతో పాల డిమాండ్ వాణిజ్య మార్కెట్‌లో ఒక్కసారిగా పడిపోయింది. గృహ వినియోగదారులున్నప్పటికీ.. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు తదితర పాల ఆధారిత మార్కెట్ మూతబడిందని, ఫలితంగా పశు పోషణ భారమై చాలామంది రైతులు నష్టాల్లోకి జారుకున్నారని వివరిస్తున్నారు.
ఇప్పుడు మార్కెట్ మళ్లీ మునుపటి స్థితికి వచ్చినా.. స్థానికంగా పాడి పరిశ్రమ బలోపేతంగా లేదని అంటున్నారు. పైగా దాణా రేట్లు పెరగడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చుతున్నదని చెప్తున్నారు. దీంతో రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇక మార్చి 1 నుంచి ముంబైలో బర్రె పాల ధర లీటర్ రూ.5 పెరగనుందని అక్కడి పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది.