MIM Asaduddin అమిత్‌షాకు చరిత్ర తెలియదంటూ విమర్శలు ఎంఐఎం అధినేత అసదుద్ధిన్ విధాత : దేశ రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు బలమైన అవకాశాలున్నాయని, దీనికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని తాను అభిప్రాయపడుతున్నానని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ అన్నారు. హైద్రాబాద్‌లో సీడబ్ల్యుసీ సమావేశాల నిర్వాహణపై ఆయన మీడియాతో మాట్లాడుతూ మాయవతి, కేసీఆర్‌లు ఏ కూటములలో లేరని, ప్రాంతీయంగా మంచి పట్టున్న చాల పార్టీలు ఎన్‌డీఏ, ఇండియా కూటమిలలో చేరలేదన్నారు. అందుకే తృతీయ ఫ్రంట్‌కు […]

MIM Asaduddin
- అమిత్‌షాకు చరిత్ర తెలియదంటూ విమర్శలు
- ఎంఐఎం అధినేత అసదుద్ధిన్
విధాత : దేశ రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు బలమైన అవకాశాలున్నాయని, దీనికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని తాను అభిప్రాయపడుతున్నానని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ అన్నారు. హైద్రాబాద్‌లో సీడబ్ల్యుసీ సమావేశాల నిర్వాహణపై ఆయన మీడియాతో మాట్లాడుతూ మాయవతి, కేసీఆర్‌లు ఏ కూటములలో లేరని, ప్రాంతీయంగా మంచి పట్టున్న చాల పార్టీలు ఎన్‌డీఏ, ఇండియా కూటమిలలో చేరలేదన్నారు. అందుకే తృతీయ ఫ్రంట్‌కు అవకాశముందని తాను నమ్ముతున్నానని, ఇందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చెబుతుందని, మరి ముస్లింల కోసం అలాగే మహారాష్ట్రాలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేసిందని, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లలో ఏం చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, ఇక్కడ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ విధానం విఫలమైందని, ఓ పక్క కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు జరుగుతుంటే ఇంకోవైపు పాకిస్తాన్‌తో ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు తలపడటం సరికాదన్నారు.
కాశ్మీర్‌లో దేశం సైనికాధికారులను కోల్పోయిందని, ఈ సమయంలో బీజేపీ ప్రతిపక్షంగా ఉంటే భిన్నంగా స్పందించేదని, కాని అధికారంలో ఉన్నందునా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మౌనంగా ఉందన్నారు. అమిత్‌షాకు తెలంగాణ చరిత్ర ఏం తెలుసని హైద్రాబాద్ గురించి మాట్లాడుతున్నారంటూ అసదుద్ధిన్ కౌంటర్ వేశారు. తెలంగాణ విలీనంలో బీజేపీ పాత్ర ఏముందన్నారు. చేసిందేమి లేదుకాని ఏదో చేశామంటూ వేడుకలు చేస్తుందన్నారు. హర్యానా నూహ్‌లో ఏం జరిగిందన్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ ఇదేనా అన్నారు.
