- ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
- అధికారికంగా వెల్లడించనున్న ఎన్నికల కమిషన్
విధాత: హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎంఐఎం (AIMIM)అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్ (Mirza Rahmat Baig)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్నికల కమిషన్ (Election commission) అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి (Hyderabad local bodies constituency) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్లను స్వీకరించారు.
ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎంఐఎం నేత హసన్ జాఫ్రీ కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం 2023 మే 1వ తేదీ నాటికి ముగుస్తుంది. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహిస్తున్నది.
నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఎంఐఎంతో పాటు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల పరిశీలనతో ఇండిపెండెంట్ అభ్యర్థి మహ్మద్ రహీమ్ ఖాన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మీర్జా రహమత్ బేగ్ నామినేషన్ మాత్రమే సక్రమంగా ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సీఈవో వికాస్ రాజ్ ఒక ప్రకటన వెలువరించారు.