Minister Errabelli | తనకు సంబంధంలేనట్లుగా దూరం.. దూరం తాజాగా అన్ని సెగ్మెంట్లలో మంత్రి పర్యటన మంత్రి తీరు పై రాజకీయవర్గాల్లో ఆసక్తి కర చర్చ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన మంత్రి. సీఎం కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన నేత, అధిష్టానానికి ఆప్తుడు అనే పేరు. ఆయనకు కీలకమైన మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణంగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే మంత్రి, రెండు […]

Minister Errabelli |
- తనకు సంబంధంలేనట్లుగా దూరం.. దూరం
- తాజాగా అన్ని సెగ్మెంట్లలో మంత్రి పర్యటన
- మంత్రి తీరు పై రాజకీయవర్గాల్లో ఆసక్తి కర చర్చ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన మంత్రి. సీఎం కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన నేత, అధిష్టానానికి ఆప్తుడు అనే పేరు. ఆయనకు కీలకమైన మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణంగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే మంత్రి, రెండు సెగ్మెంట్లైన జనగామ బీఆర్ఎస్ లో జరుగుతున్న రచ్చ, స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తి విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఈ వ్యవహారం తనకు సంబంధంలేని అంశంగా మంత్రి వ్యవహరిస్తున్న తీరుపట్ల రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
ఆంతర్యమేంటో?
మంత్రి ఎర్రబెల్లి మౌనం వెనుక ఆంతర్యమేమిటంటూ బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మూడు నెలలుగా ఎర్రబెల్లి తన సొంత నియోజకవర్గం పాలకుర్తికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి, రానున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడే కేంద్రీకరించారు. అయితే పాలకుర్తి కాదంటే హైదరాబాద్ అన్నట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎప్పుడూ హడావుడి చేసే ఎర్రబెల్లి ఈ సమయంలో సైతం పెద్దగా స్పందించలేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సెగ్మెంట్లకు 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఒకే ఒక్క జనగామ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించలేదు. స్టేషన్ సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియానికి అవకాశం కల్పించారు. ఈ విషయంలో సైతం ఎర్రబెల్లి మౌనం పాటించారు. కానీ, తన పాత మిత్రుడు కడియానికి దక్కిన కొత్త అవకాశం పట్ల అభినందనలు తెలియజేస్తూ స్టేషన్ ఘన్ పూర్ లో ఆయన నిర్వహించిన ర్యాలీలో మాత్రం పాల్గొన్నారు. శ్రీహరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రకటించారు.
ఎమ్మెల్యే రాజయ్యకు దూరంగా..
ఎమ్మెల్యే రాజయ్య తనకు శ్రీహరితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో చాలా కాలంగా మంత్రి ఎర్రబెల్లితో సన్నిహితంగా వ్యవహరిస్తూ వచ్చారు. తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆయనను ఆహ్వానిస్తూ వచ్చారు. కానీ, టికెట్ రాక తీవ్ర మనస్థాపానికి గురైన రాజయ్యను సంప్రదించడం, ఓదార్చడం ఇప్పటివరకు మంత్రి చేయకపోవడం పట్ల రాజయ్య అనుచరులు అసంతృప్తితో ఉన్నారు.
రాజయ్యను అధిష్టానం దూతగా కలిసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకసారి ప్రయత్నించారు తప్ప, మంత్రి మాత్రం ఈ విషయాన్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఆఖరికి రాజయ్య కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహను కలిశారని, కాంగ్రెస్ లోకి వెళతారని ఊహాగానాలు సాగుతున్నా, ఆ వైపు కన్నెత్తి చూడలేదు. అధిష్టానం దూతగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వెళ్ళి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పైగా రాజయ్య జనగామ జిల్లా పరిధిలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జనగామను పట్టించుకోని మంత్రి
తాను మంత్రిగా ప్రాతినిధ్యంవహిస్తున్న జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి అనూహ్యంగా పెండింగ్ లో పడింది. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నం, మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించి, పల్లా టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. జనగామ బీఆర్ఎస్ రచ్చరచ్చగా మారి రోడ్డెక్కిన సందర్భంగా అభ్యర్థి ప్రకటనకు పీటముడి పడింది. ఇంత జరుగుతున్నా ఎర్రబెల్లి ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. తనకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆ రెండూ తప్ప అంతటా పర్యటనలు
తాజాగా పాలకుర్తిలో పరిస్థితులు కుదుటపడ్డాయా? లేక మంత్రిగా తన ప్రాధాన్యతను గుర్తించారా? కారణమేదైనా రెండు, మూడు రోజులుగా అన్ని సెగ్మెంట్లలో కలియ తిరుగుతున్నారు. వల్మిడిలో ఉత్సవాలు నిర్వహించిన తర్వాత కాసింత రిలీఫ్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆయన వరుసగా వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు, ములుగు, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లలో పర్యటించారు.
అయినా ఆ రెండు నియోజకవర్గాలైన స్టేషన్ ఘన్ పూర్, జనగామ వ్యవహారాలను మాత్రం పట్టించుకోవడంలేదు. హనుమకొండలోనే రాజయ్య ఉంటున్నప్పటికీ ఆ దిక్కే చూడడంలేదు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య మొన్న వల్మిడిలో జరిగిన దేవాలయ ఉత్సవానికి హాజరు మాత్రం అయ్యారు. అయినా మంత్రి తీరులో మార్పు కనిపించలేదు. కారణమేమిటంటూ చర్చించుకుంటున్నారు.
