Arogya Mahila Scheme | విధాత, కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి సెంటిమెంట్‌. ఇక్కడి నుంచే రైతుబంధు సహా పలు పథకాలను ప్రవేశపెట్టగా విజయవంతమయ్యాయి. తాజాగా మరో పథకానికి సర్కారు సన్నద్ధమైంది. ఈ పథకానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించి.. ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా […]

Arogya Mahila Scheme | విధాత, కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి సెంటిమెంట్‌. ఇక్కడి నుంచే రైతుబంధు సహా పలు పథకాలను ప్రవేశపెట్టగా విజయవంతమయ్యాయి. తాజాగా మరో పథకానికి సర్కారు సన్నద్ధమైంది. ఈ పథకానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించి.. ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో ‘ఆరోగ్య మహిళా’ పథకాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

వంద పీహెచ్‌సీల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలు

మహిళలు వ్యాధుల బారినపడకుండా ముందస్తుగా గుర్తించి.. అవసరమైన చికిత్సలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల చెప్పారు. ఇందులో భాగంగానే కరీంనగర్‌ పట్టణంలోని బుట్టి రాజారాం కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మార్చి 8న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

పథకంలో నిర్వహించే పరీక్షలు ఇవే..

ఆరోగ్య మహిళా పథకంలో నిర్వహించనున్న పరీక్షల వివరాలను మంత్రి వెల్లడించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, మైక్రో న్యూట్రీఎంట్ల లోపం, యుటిప్ ట్రాక్ అండ్ పెల్సిక్ వ్యాధులు, మోనోపాజ్ సమస్యలు, పీసీవోడీ, బహిష్టు సమస్యలు, కుటుంబ నియంత్రణ, రక్తపోటు, మధుమేహం, సంతానోత్పత్తి సమస్యలు, సుఖ వ్యాధులు, బరువు, ఊబకాయంతో కలిపి మొత్తం 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు.

సమావేశంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జవేరియా, జిల్లా ప్రధాన దవాఖానా సూపరింటెండెంట్‌ రత్నమాల, ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, ఆర్డీవో ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 7 March 2023 1:58 AM GMT
Vineela

Vineela

Next Story