Minister Jagadish Reddy
విధాత: ప్రగతి నిరోధకులు అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని, అందుకే సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ గైర్హాజరయ్యారని మంత్రి జి. జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన జరిగే నష్టం శూన్యమన్నారు. రావడం రాక పోవడం గవర్నర్ విజ్ఞత మీద ఆధార పడి ఉంటుందన్నారు.
సచివాలయ ప్రారంభోత్సవానికి గైర్హాజర్ తో గవర్నర్ నిజ స్వరూపం బయట పడిందన్నారు. అభివృద్ధిని అభినందించే గుణం ప్రతిపక్షాలకు లేదన్నారు. తెలంగాణా అభివృద్ధిని విపక్షాలు ఇష్ట పడడం లేదన్నారు. జరుగుతున్న అభివృద్ధితో అడ్రెస్ గల్లంతు అవుతుందన్న బెంగ ప్రతిపక్షాలను వెంటాడుతుందన్నారు.
గవర్నర్ ను నియమించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. హక్కులను అణిచివేయడం, ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం మినహా బీజేపీ ప్రభుత్వాలు దేశానికి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు తెలంగాణతో పోటీ పడలేకపోతున్నాయన్నారు.
ప్రజాక్షేత్రంలో వారికి భంగపాటు తప్పదన్నారు. తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి నూతన సచివాలయం ప్రతీక అన్నారు. నూతన సచివాలయం నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.