Minister KTR హ్యాట్రిక్ విజయంపై ధీమా రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ కాంగ్రెస్‌కు కేవిపీ, షర్మిలల నాయకత్వంపై ఎద్దేవా జాతీయ పార్టీలు ఢిల్లీ బానిస పార్టీలు చిట్ చాట్ లో మంత్రి కేటీఆర్ విధాత, హైద్రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల ముందస్తు ప్రకటనతో రాజకీయంగా బీఆరెస్‌కు క్షేత్ర స్థాయిలో అంతా సానుకూల పరిణామమే నెలకొందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మీడియా చిట్ […]

Minister KTR
- హ్యాట్రిక్ విజయంపై ధీమా
- రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ
- కాంగ్రెస్‌కు కేవిపీ, షర్మిలల నాయకత్వంపై ఎద్దేవా
- జాతీయ పార్టీలు ఢిల్లీ బానిస పార్టీలు
- చిట్ చాట్ లో మంత్రి కేటీఆర్
విధాత, హైద్రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల ముందస్తు ప్రకటనతో రాజకీయంగా బీఆరెస్‌కు క్షేత్ర స్థాయిలో అంతా సానుకూల పరిణామమే నెలకొందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా గెలుస్తామని హ్యాట్రిక్ విజయంతో మూడోసారి బీఆరెస్ అధికారంలోకి రాబోతుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు.
క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ సమాచారం మేరకు ఈ రాష్ట్రానికి మళ్లీ సీఎంగా కేసీఆర్ ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలన్నదానిపై ప్రజలకు చాలా స్పష్టత ఉందని, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయన్నారు. కేసీఆర్ పాలన, బీఆరెస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.
ఎన్నికల్లో ప్రతిపక్షాల పోటీ కేవలం రెండో స్థానం కోసమేనని ఎద్దేవా చేశారు. సిటింగ్ లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయన్నారు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదని, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదన్నారు.
జాతీయ పార్టీలు ఢిల్లీ బానిస పార్టీలు
జాతీయ పార్టీలు ఢిల్లీ బానిస పార్టీలని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల సీఎం అభ్యర్థులను నిర్ణయించే పరిస్థితి ఉందన్నారు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరబోరన్నారు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా, తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరి పార్టీ కాంగ్రెస్ అని, తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావు పైననే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని దుయ్యబట్టారు. కేవీపీ రామచంద్రరావు, షర్మిలలు, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని, తెలంగాణలో ఈరోజు వారు కాంగ్రెస్ ని గెలిపిస్తారంటని, తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిలలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతటి దుస్థితి పట్టిందో అర్ధమవుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డిలు ఇప్పుడు తెలంగాణ కోసం ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుల ముసుగులో వచ్చారన్నారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ, షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా మరోసారి ఏకమవుతున్నారని, బహురూపుల వేషాల్లో తెలంగాణ పైకి వస్తున్నారని, వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
పైకి కనబడేది కిషన్ రెడ్డినేగాని ఆడించేది మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి అని, కాంగ్రెస్‌లోనూ పైకి రేవంత్ రెడ్డి ఉన్నా ఆడించేది కేవీపీ రామచంద్రరావు అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మా కర్మ అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అని కేటీఆర్ విమర్శించారు.
ఇప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా… ఒక్కరన్న రాజీనామా చేశారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే ఆ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, సోనియా ఇచ్చింది అంటే అన్యాయంగా ఉంటుందన్నారు. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటీష్ వారు అని, బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుందంటూ కేటీఆర్ తప్పుబట్టారు.
కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మరు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా 4000 రూపాయల పెన్షన్ ఇస్తుందా చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. 55 సంవత్సరాల పాలనలో 200 రూపాయలు దాటి పెన్షన్ ఇవ్వని వారు రేపు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి చెప్పినా ప్రజలు నమ్మరని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పాత చరిత్ర తెలుసన్నారు.
పాలమూరు ప్రాజెక్టు పైన కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలే ఈరోజు ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయన్నారు. 1963 లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ ఎస్పీ కాలువను నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించలేదా అని నిలదీశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని 13,14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టును రాజకీయాలకు అతీతంగా అంతా స్వాగతించాలన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే ధైర్యం లేని పార్టీలు ఈరోజు మాపైన ఎన్నికల్లో పోటీ అంటున్నాయని ఎద్దేవా చేశారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిమ్మిక్కు
తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా కాంగ్రెస్, బీజేపీలు నిలదీయడం లేదన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమ్మిక్కును మోడీ తెరపైకి తెచ్చారన్నారు. దేశంలో మోడీని మా పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ కూడా విమర్శించలేదన్నారు. బీజేపీకి బీటీమ్ గా ఉండాల్సిన ఖర్మ మాకు లేదన్నారు. ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా లేదా జీవితాలలో వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా అని ప్రజలను ఎన్నికల్లో కోరుతామన్నారు.
కాంగ్రెస్, బీజేపీలే లోపాయికారి అవగాహానతో ఉన్నాయని, అందుకే ఆ రెండు పరస్పరం విమర్శించకోకుండా బీఆరెస్ మీద పడుతున్నాయన్నారు. మా నాయకుల పైన దాడులు చేసిన ఈడి, ఐటీలు ఒక్క కాంగ్రెస్ నాయకుడి పైన కూడా దాడులు చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం కావాలని కలలు కంటున్నాడన్నారు. ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీ పడాల్సి రావడమే ఈ రాష్ట్రం దురదృష్టమన్నారు.
తెలంగాణలో 65 సంవత్సరాలలో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు కేవలం రెండు మెడికల్ కాలేజీలేనని, కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, నవోదయ పాఠశాల తెలంగాణకు ఇవ్వలేదన్నారు. పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులలో పెడదామా ప్రజలు తెలుసుకోవాలని, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్టు తదితర పరిణామాలపై మాట్లాడడానికి ఏం లేదని, పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పైన మాకు ఏలాంటి సంబంధం లేదని, అది వారి తలనొప్పి అని మాకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
