విధాత, నిజామాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు మున్సిపల్ సర్వసభ్య సమావేశం తీర్మానం చేయకుంటే ఈ నెల 20న ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇంటిని ముట్టడించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.
కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేట గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు.
గుంట భూమి కూడా రైతులకు నష్టం కలిగించే ప్రసక్తి లేదని కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యేలు హామీలిస్తున్నారని, ఆ ప్రకారం ఈ నెల 19వ తేదీ వరకు మున్సిపల్ సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
సమావేశం నిర్వహించని పక్షంలో 19న 3 గంటల వరకు విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్ లు రైతులకు మద్దతు తెలుపుతూ మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా రాజీనామా చేయాలన్నారు. ఎవరైనా కౌన్సిలర్ రాజీనామా చేయకపోతే వారిపై వచ్చే సమావేశములో నిర్ణయం తీసుకుంటామని, తమతో కలిసి వచ్చిన కౌన్సిలర్ లతో 19న 3 గంటలకు కమిషనర్ కు రాజీనామా పత్రాలు అందజేస్తామన్నారు.
సమావేశంలో రైతులకు మద్దతుగా బీజేపీకి చెందిన కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారీ రవి రాజీనామా పత్రాలను రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులకు అందజేశారు. రద్దు తీర్మానం చేయక పోతే 20న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణరెడ్డి, కమిటీ నాయకులు విఠల్, కుమ్మరి రాజయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.