- ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు
విధాత, మెదక్ బ్యూరో: Basti Dawakhana| పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని,ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్ట పరిచి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(MLA Padma Devender Reddy) అన్నారు.
సుదూర ప్రాంతంలో ఉన్న ప్రజలు వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లకుండా, వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో బస్తీ దవాఖానా(Basti Dawakhana)లు ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. అందులో భాగంగా మెదక్ పట్టణంలో 27 వ వార్డులోని అంబేద్కర్ కాలనీలో 16 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదారి చందు నాయక్(Chandu Naik)తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద వారికి ఉచిత విద్య, వైద్యం అందించుటకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, గురుకుల పాఠశాలలు నెలకొల్పి మంచి విద్యాబోధన కల్పిస్తున్నది అన్నారు.
మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రికార్డ్ స్థాయిలో ఒక్క రోజే 25 కాన్పులు చేశామని, వైద్యుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ బస్తీ దవాఖానలో అత్యవసర కేసులను కూడా చూసేలా వైద్యులను ఏర్పాటు చేశామని బస్తీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆరోగ్య విషయంలో ప్రజలు ఎలాంటి రుగ్మతలకు లోనుకాకుండా చూడాలనే దృక్పధంతో ప్రభుత్వం ప్రతి విషయాన్నినిశితంగా గమనిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఏ సమయంలో ఎటువంటి వైద్యం తీసుకోవాలి, వాక్సిన్ వేసుకోవాలో, మందులో వాడాలో అవగాహన నిమిత్తం కార్డులు అందజేస్తున్నామని, మధుమేహ వ్యాధి, బీపీ పేషంట్లకు కిట్ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి(Lavanya Reddy), వైద్యాధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.