- అధిష్టానం జోక్యంతో ఇద్దరి మధ్య సయోధ్య
- మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్‌ఘన్‌పూర్ (StationGhanpur) నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ (Dharma sagar) మండలం జానకిపురం గ్రామ సర్పంచ్ (Sarpanch) కురసవల్లి నవ్య (kurasavalli Navya) స్థానిక ఎమ్మెల్యే (MLA) డాక్టర్ తాటికొండ రాజయ్య (Tatikonda Rajayya)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంఘటనలో ఆదివారం ఆశ్చర్యంకరమైన ట్విస్ట్ ఏర్పడింది.
సర్పంచ్ కురసపెల్లి నవ్య తనను ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో సమస్య జటిలంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయగా, టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పందించి సమస్య పరిష్కారానికి ఇరువైపులా చర్యలు చేపట్టింది. విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ప్రయత్నం చేసింది.
సర్పంచ్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే
ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్య ఆదివారం ఒక మెట్టు దిగి ఆకస్మికంగా జానకిపురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. నవ్య భర్త ప్రవీణ్ కుమార్ ఆహ్వానం మేరకు తామిక్కడికి వచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య మీడియాతో కలిసి మాట్లాడారు. ఇరువురు మాట్లాడిన అంశాల మధ్య కొంత విభేదాలు ఉన్నప్పటికీ, సమస్య కొంతమేరకు సద్దు మణిగినట్లేనని భావిస్తున్నారు.
జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా: ఎమ్మెల్యే రాజయ్య
నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానని స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. నేను ఏ ఊరిపట్ల వివక్ష చూపలేదు. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని రాజయ్య చెప్పారు.
BRS | ఎమ్మెల్యే ఫోన్ చేసి ఒంటరిగా రమ్మంటున్నడు.. కోరిక తీర్చాలని వేధిస్తున్నారు: మహిళా సర్పంచ్
మహిళల హక్కుల కోసం పోరాటంలో నేనూ ఉంటానని హామినచ్చారు. జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. జానకీపురం గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తా. అధిష్ఠానం ఆదేశం, నవ్య భర్త ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. పార్టీ అధిష్ఠానం మాకు పలు సూచనలు చేసిందని అందరూ కలిసి పనిచేయాలని అధిష్ఠానం చెప్పిందన్నారు.
చెడును కచ్చితంగా ఖండిస్తా: సర్పంచ్ నవ్య
మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకూ సిద్ధమని, పార్టీలో తప్పులు జరిగితే ఖండిస్తూనే ఉంటానని సర్పంచ్ నవ్య అన్నారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యమని, ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్‌ను కాగలిగానని ఆమె చెప్పారు.
రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దని, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమన్నారు. మాకు దక్కాల్సిన గౌరవం దక్కకుంటే సహించేది లేదని, మహిళలపై అరాచకాలు జరిగితే సహించేది లేదన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేను ఈ సందర్భంగా కోరానని అన్నారు.
నోరుజారిన MLA చిరుమర్తి.. బండి సంజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న BJP శ్రేణులు