- జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎస్పీ
విధాత బ్యూరో, కరీంనగర్: శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. మద్యం పాలసీ నిర్ణయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న కవిత కొద్దిరోజుల క్రితం పార్టీ నేతలను పక్కనపెట్టి ఒక్కరే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. శుక్రవారం ఆమె జగిత్యాలకు వస్తుండడంతో పార్టీ వర్గాలలో ఆసక్తి నెలకొంది.
స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించనున్న నియోజకవర్గ స్ధాయి బీఆర్ఎస్
కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బైక్ ర్యాలీతో ఆమెకు స్వాగతం పలకనున్నారు. కొత్త బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆత్మీయ సమ్మేళనం జరిగే కళ్యాణ మండపానికి కవిత చేరుకుంటారు.
మరోవైపు పోలీస్ యాక్ట్ పేరిట నిషేధాజ్ఞలు
ఇదిలా ఉండగా ఏప్రిల్ ఒకటి నుండి 30 వరకు జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.