విధాత: మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఖాయమని బీజేపీ నేతలు మీడియా ముందు చెప్పారు. దీంతో ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చిన నాటి నుంచి నేడు విచారణ ముగిసే వరకు రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కవితను ఈడీ విచారించనున్నట్టు అన్న వార్తలు వచ్చిన రోజు నుంచే రాష్ట్ర మంత్రలు బీజేపీపై విరుచుకు పడ్డారు.
మంత్రి కేటీఆర్ ఇవి ఈడీ నోటీసులు కాదు మోడీ నోటీసులని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేంలో తన కుమార్తె కవిత అరెస్టుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో ఏం చేస్తారో చూద్దామని, రాష్ట్రంలోనూ వాళ్లు గెలిచే ప్రసక్తే లేకనే బీజేపీ కుట్రలుల చేస్తున్నదని కేసీఆర్ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మూడు రోజుల పరిణామాలను గమనిస్తే కవిత విచారణ విషయాన్ని, అరెస్టు వార్తలను బీఆర్‌ఎస్ అధినేత తనకు అనుకూలంగా మలుచుకున్నారు. పద్నాలుగేళ్లు ఉద్యమం చేసిన ఆ పార్టీ నేతలు గత తొమ్మిదేళ్లుగా అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చారు. అంతేగానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చింది లేదు. ఈ తొమ్మిదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు, స్వీట్లు పంచుకోవడాలు తప్పితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాలుపంచుకున్నది తక్కువే.
మద్యం కుంభకోణంలో విపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయ ప్రేరేపిత కుట్రగానే ఆప్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా విమర్శిస్తూ వస్తున్నది. ఈ కేసుతో పాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మంత్రులు, నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులను తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని, కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ పారిపోయారని, స్టే తెచ్చుకున్నారని మూడు రోజులుగా బీజేపీపై మంత్రులు, నేతలు మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రధానిని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంను, ఎమ్మెల్యేల కొనుగోలు, అదానీ వ్యవహారానికి ముడిపెట్టడంలో అధికారపార్టీ నేతలు రాజకీయంగా బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.
ఈ ఉద్రిక్తల నేపథ్యంలోనే బండి సంజయ్ కవిత అరెస్టుపై చేసిన అనుచిత వ్యాఖ్యలనూ అధికార పార్టీకి ఆయుధంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు ఇచ్చే నోటీసులకు, అవి చేసే విచారణతో బీజేపీకి ఏం సంబంధం అని ఆ పార్టీ నేతలు అంటూనే.. తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టు రాజగోపాల్‌రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు కవిత అరెస్టును ఈడీ విచారణకు ముందే మీడియా ముందు ఖాయం చేశారు. దీంతో ఈ స్కాంలో ఈడీ విచారణ కంటే నేతల వ్యాఖ్యలనే అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు కనిపిస్తున్నది.
ఒకవేళ కవితను అరెస్టు చేస్తే ఢిల్లీ నుంచి గల్లి వరకు కేసీఆర్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయించి రాజకీయంగా పై చేయి సాధిస్తారు అని బీజేపీ జాతీయ నేతలు అంచనా వేశారు. మరోవైపు అరుణ్ రామచంద్ర పిళ్లై కవిత బినామీ అని ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఆమెను ఇవాళ విచారించారు అని తెలుస్తోంది. అయితే కవిత విచారణకు ఒక రోజు ముందు ఆయన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్.
ఈ కేసులో అంతిమంగా ఏం జరుగుతుంది అనేది పక్కనపెడితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు అందరినీ సీబీఐ, ఈడీలు అరెస్టు చేశాయి. ఇక మిగిలింది కవితే అని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఈ పరిణామాలన్నీ జరగడం విశేషం. ఇవాళ విచారణ ముగిసిన అనంతరం ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చారు.
మరోవైపు ఈ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తరఫున వాదిస్తున్న దయన్‌కృష్ణ కొన్ని కీలక కామెంట్లు చేశారు. విచారణ ఏజెన్సీలు వ్యక్తుల అరెస్టులను హక్కుగా భావిస్తున్నాయని, ఇది వాటికి ఫ్యాషన్‌గా మారిందని, ఇలాంటి విధానాలు న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలన్నారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన నూతన మద్యం పాలసీ బిల్లు లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్లిందని, ఆయన దాన్ని క్లియర్ చేశారు.
కాబట్టి ఈ కేసులో ఈడీ ఆయనను కూడా విచారిస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా (అప్పటి ఎక్సైజ్ మంత్రి) పై 2022 ఆగస్టు 17న కేసు నమోదు మొదలు ఈరోజు వరకు అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి విచారించనున్నది. అప్పటిదాకా స్టే ట్యూన్ అన్నట్టు ఉన్నది.