- బీజేపీ, జనసేన పొత్తుకు బీటలు ?
- చిచ్చు రేపిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు !!
విధాత: ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన మధ్య పొత్తులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చిచ్చు పెడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతుంది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మంగళవారం మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్టు చేయమని అడిగితే జనసేన ముందుకు రాలేదన్నారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఉన్నా లేనట్టుగానే ఉందన్నారు. పొత్తుల విషయంలో తమకు చాలా ఆలోచనలు ఉన్నాయన్నారు.
భవిష్యత్తులో జగన్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించబోయే ఉద్యమాల్లో జనసేన కలిసి వస్తుందో లేదో చూడాలి అన్నారు. తమ మధ్య పొత్తు ఉందన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు కలిసి పనిచేయడం లేదన్నారు. పేరుకే జనసేన, బీజేపీ పొత్తు పరిమితమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లిందని, వైకాపా, బీజేపీ ఒకటేనన్న భావన కూడా బీజేపీకి నష్టం చేస్తుందన్నారు. పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
మరోవైపు పార్టీ మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్దతు ప్రకటించారని ఎమ్మెల్సీ మాధవ్ ఏ ఉద్దేశంతో అలా అన్నారో తనకు తెలియదని, వైసీపీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా జనసేన, బీజేపీ కూటమి మాత్రమే ఉందన్నారు.
అటు మాధవ్ వాఖ్యలను జనసేన నాయకులు ఖండించారు. బీజేపీ పార్టీ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి సహాయము తమ పార్టీని కోరలేదని పార్టీ నాయకులు శివశంకర్, కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలనుకుంటుందని, బీజేపీ సొంతంగా ఎదుగుతామంటే స్వాగతిస్తామన్నారు. పొత్తును ముందుకు తీసుకు వెళ్లాలంటే బీజేపీ ముందుగా ఉమ్మడి రాజకీయ కార్యక్రమాలతో ముందుకు రావాలన్నారు.
రాష్ట్ర ప్రజలంతా పవన్ వైపే చూస్తున్నారన్నారు. ఏపీ బీజేపీలో చాలా గ్రూపులు ఉన్నాయన్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీపై విమర్శలు చేయడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చిందని బీజేపీ నాయకులలో అసంతృప్తి వ్యక్తం అయింది. అటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దే దించే లక్ష్యంతో జనసేన మెల్లగా టీడీపీకి దగ్గరవుతున్న క్రమంలోనే బీజేపీ జనసేనలకు మధ్య దూరం పెరుగుతుందన్న వాదన వినిపిస్తుంది.