- అదానీ గ్రూప్ బొగ్గు వ్యాపారానికి దన్నుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు
విధాత: గౌతమ్ అదానీ (GOUTHAM ADANI), నరేంద్ర మోదీ (NARENDRA MODI) సర్కారు స్నేహ బంధంపై మరో రిపోర్టు వచ్చింది. అదానీ గ్రూప్ బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నదని అల్ జజీరా (AL JAZEERA) తాజాగా ఓ కథనాన్ని ఆధారాలతోసహా ప్రచురించింది.
మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ప్రైవేట్ రంగానికి బొగ్గు గనుల కేటాయింపుల్లో పారదర్శకత లోపించిందని సదరు రిపోర్టు పేర్కొన్నది. ఈ క్రమంలోనే దేశంలోని దట్టమైన అడవిలో 450 మిలియన్ టన్నులకుపైగా బొగ్గు నిల్వలున్న ఓ బ్లాక్ తవ్వకాలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు మాత్రమే అనుమతి వచ్చినట్టు తెలిపింది.
అంతేగాక ఏకంగా చట్టాలనే మార్చి ఇతర కంపెనీలకు ఈ అవకాశం దక్కకుండా మోదీ సర్కారు చేసినట్టు అల్ జజీరా రిపోర్టు వెల్లడించింది. ఈ విషయంలో అదానీ గ్రూప్‌కు మాత్రమే ఎందుకింత మినహాయింపు ఉందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.
2014లో 204 బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన ఓ రెగ్యులేషన్ కింద అదానీ గ్రూప్‌కు మాత్రం ప్రత్యేక హక్కులను కట్టబెట్టినట్టు ది రిపోర్టర్స్ కలెక్టివ్ (THE REPORTERS COLLECTIVE)పేరుతో విడుదలైన రిపోర్టులో అల్ జజీరా వివరించింది.
నిజానికి తాజా కథనం.. ది రిపోర్టర్స్ కలెక్టివ్‌లోని రెండో భాగం. మొదటి భాగంలో బడా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తున్న షెల్ కంపెనీ (SHELL COMPANY)లపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆందోళనల్ని మోదీ సర్కారు పక్కన బెట్టడం, దేశంలోని బొగ్గు నిల్వలపై కార్పొరేట్ గుత్తాధిపత్యానికి జై కొట్టడం గురించి ఉన్నది.
కాగా, పశ్చిమ బెంగాల్ బొగ్గు గని వేలంలో ఆర్‌పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ (RP-SANJIV GOENKA GROUP) అవకతవకలకు మోదీ సర్కారు దన్నుగా నిలిచిందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ (HINDEBURG) రిపోర్టు నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.