భార‌త్ బ‌చావో స‌ద‌స్సులో వక్తలు విధాత: ఈ మ‌ధ్య మోదీ పాల‌నా విధానాల‌పై ప్ర‌జ‌ల్లో క‌ద‌లిక మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోంచే.. డాక్ట‌ర్ ఎంఎఫ్ గోపీనాథ్‌, గాదె ఇన్నారెడ్డి నేతృత్వంలో భార‌త్ బ‌చావో పేరిట హైద‌రాబాద్ సుంద‌రయ్య విజ్ఞాన కేంద్రంలో రెండ్రోజుల స‌ద‌స్సు జ‌రిగింది. అలాగే తెలంగాణ వికాస స‌మితి ఆధ్వ‌ర్యంలో మోదీ ఫాసిజం- ముంచుకొస్తున్న ప్ర‌మాదం పేరిట మ‌రో స‌ద‌స్సు జ‌రిగింది. ఈ రెండు స‌ద‌స్సుల్లో దేశంలో మెజారిటీవాద రాజ‌కీయాలు పునాదిగా మోదీ అనుస‌రిస్తున్న నియంతృత్వ ఫాసిస్టు […]

భార‌త్ బ‌చావో స‌ద‌స్సులో వక్తలు

విధాత: ఈ మ‌ధ్య మోదీ పాల‌నా విధానాల‌పై ప్ర‌జ‌ల్లో క‌ద‌లిక మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోంచే.. డాక్ట‌ర్ ఎంఎఫ్ గోపీనాథ్‌, గాదె ఇన్నారెడ్డి నేతృత్వంలో భార‌త్ బ‌చావో పేరిట హైద‌రాబాద్ సుంద‌రయ్య విజ్ఞాన కేంద్రంలో రెండ్రోజుల స‌ద‌స్సు జ‌రిగింది. అలాగే తెలంగాణ వికాస స‌మితి ఆధ్వ‌ర్యంలో మోదీ ఫాసిజం- ముంచుకొస్తున్న ప్ర‌మాదం పేరిట మ‌రో స‌ద‌స్సు జ‌రిగింది. ఈ రెండు స‌ద‌స్సుల్లో దేశంలో మెజారిటీవాద రాజ‌కీయాలు పునాదిగా మోదీ అనుస‌రిస్తున్న నియంతృత్వ ఫాసిస్టు విధానాల‌ను చ‌ర్చించటం గ‌మ‌నార్హం.

మోదీ నియంతృత్వ విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ స‌మాజంలోని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు, ముఖ్యంగా ప్ర‌జాసంఘాలు, ద‌ళిత సంఘాలు, ఉద్య‌మ‌సంస్థ‌లు, మేధావులు చేయి చేయి క‌లిపి క‌లిసి న‌డ‌వాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించి ఏక‌తాటిపైకి రావ‌టం గ‌మ‌నించ‌ద‌గిన‌ది. ఈ మ‌ధ్య కాలంలో అన్ని వ‌ర్గాల ప్రాతినిథ్య‌తో జ‌రిగిన స‌ద‌స్సు ఇదే కావ‌టం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన ఈ ఎనిమిదేండ్ల కాలంలో ముఖ్యంగా ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ను ప్రైవేటుకు క‌ట్ట‌బెట్ట‌డాన్నిమోదీ ఒక విధానంగా అనుస‌రిస్తున్నారు. నిరుద్యోగం తాండ‌విస్తున్నా ప‌ట్టించుకోక పోవ‌ట‌మే కాకుండా ల‌క్ష‌లాది చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేస్తున్నారు. వ్య‌తిరేకిస్తున్న వారిని అణిచివేసేందుకు నిర్బంధాన్ని ప‌రిష్కారంగా ఎంచుకున్నారు. నిర‌స‌న గ‌ళాల‌పై పాశ‌వికంగా విరుచుకుప‌డుతున్నారు. క‌నీస విమ‌ర్శ‌ను సైతం స‌హించ‌లేక నిర‌స‌న గ‌ళాల‌పై దేశ‌ద్రోహ కేసులు మోపుతూ జైళ్ల‌లో నిర్బంధిస్తున్నారు. హిందుత్వ రాజ‌కీయాల‌ను తాత్వికంగా వ్య‌తిరేకిస్తూ విమ‌ర్శిస్తున్న వారిపై ఏకంగా హ‌త్యాకాండ‌కు పాల్ప‌డుతున్నారు. గౌరీలంకేశ్‌, క‌ల‌బుర్గీ, ప‌న్సారే, ద‌భోల్క‌ర్ లాంటి శాస్త్రీయ హేతువాద మేధావుల‌ను హ‌త్య‌ చేశారు.

అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేస్తున్న వారిపై క‌త్తి గ‌ట్టింది మోదీ ప్ర‌భుత్వం. ప్ర‌జా కార్య‌క‌ర్త‌లు, ర‌చ‌యిత‌లు, మేధావుల‌పై కుట్ర‌ కేసులు మోపి జైళ్ల‌లో బంధిస్తున్న‌ది. ఏండ్ల‌కు ఏండ్లు జైళ్ల‌లో నిర్బంధిస్తూ క‌నీస వైద్య స‌దుపాయాల‌ను కూడా క‌ల్పించ‌కుండా వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ది. స్టాన్ స్వామి లాంటి వారు క‌నీస సౌక‌ర్యాలు అంద‌క జైలు నిర్బంధంలోనే తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ సాయిబాబ‌, విప్ల‌వ ర‌చ‌యిత వ‌ర‌వ‌ర‌రావు లాంటి వారు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఏండ్లకు ఏండ్లుగా జైళ్లో ఉన్నారు. ఏండ్లు గ‌డుస్తున్నా బెయిల్ ఇవ్వ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం ప‌రోక్ష హ‌త్య‌కు ప‌న్నాగాలు ప‌న్నుతున్న‌ది.

ఇదిలా ఉంటే.. అధికార విప‌క్ష పార్టీల‌ను సైతం మోదీ వ‌దల‌టం లేదు. బీజేపీయేత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అస్థిర‌ప‌రిచ‌ట‌మే ప‌నిగా బీజేపీ అనుస‌రిస్తున్న‌ది. విప‌క్ష పార్టీ స‌భ్యుల‌ను ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడుతున్నారు. విప‌క్షాల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురించేసి లొంగ‌ దీసుకోవ‌టానికి ఈడీ, ఐటీ సంస్థ‌ల‌ను దాడుల‌కు ఉసి గొల్పుతున్నారు. మ‌హారాష్ట్ర‌లో లాగే వివిధ రాష్ట్రాల్లో ఏక్‌నాథ్ షిండేల‌ను సృష్టిస్తామ‌ని బాహాటంగానే ప్ర‌క‌టిస్తున్నారు. దీనికంత‌టికీ ప‌రాకాష్టగా తెలంగాణ‌లో న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌టానికి ప్ర‌య‌త్నించ‌టం అంద‌రికీ తెలిసిందే.

మ‌రో వైపు.. దేశ‌వ్యాప్తంగా రైతులు మ‌రో ఉద్య‌మానికి స‌న్నాహమ‌వుతున్నారు. గ‌తంలో ఏడాది పాటు సాగిన రైతు ఉద్య‌మంతో వెన‌క్కి తీసుకున్న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను మోదీ ప్ర‌భుత్వం దొడ్డి దారిన అమ‌లు చేయ‌చూస్తున్న‌ద‌ని మండి ప‌డుతున్నారు. నాడు రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కి రైతుల ప్ర‌యోజనాల‌ను దెబ్బ‌తీసే కుటిల య‌త్నాలకు పాల్ప‌డుతున్నాడ‌ని ఆగ్ర‌హిస్తున్నారు. మోదీ మెడ‌లు వంచి త‌మ ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించుకొనేందుకు రైతులు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.

స‌రిగ్గా ఈ ప‌రిస్థితుల్లోంచే.. తెలంగాణ‌లో జ‌రిగిన రెండు స‌ద‌స్సుల‌ను చూడాలి. గ‌త ఎనిమిదేండ్లుగా ఆయా సామాజిక స‌మూహాల‌న్నీ ఒంట‌రిగా మోదీ విధానాలపై వ్య‌తిరేకేత‌త‌తో ఉన్నా కార్యాచ‌ర‌ణ‌కు పూనుకోలేదు. ముఖ్యంగా మేధావి వ‌ర్గంలో నెల‌కొన్న భ‌యాందోళ‌నల కార‌ణంగా కొంత స్త‌బ్ద‌త ఏర్ప‌డింది. నానాటికీ మోదీ ప్ర‌జావ్య‌తిరేక విధానాలు శృతిమించి పోతున్నాయి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను బ‌హుళ జాతి కంపెనీల‌కు తాక‌ట్టు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోంచే ఉద్య‌మ సంస్థ‌లు మొద‌లు ప్ర‌జా సంఘాలు మోదీ ఫాసిస్టు విధానాల‌ను నిలువ‌రించే అవ‌సారాన్ని గుర్తించి కార్యాచ‌ర‌ణ‌కు దిగుతున్న ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి.

రెండు స‌ద‌స్సుల్లోనూ మోదీ మెజారిటీవాద హిందుత్వ ఫాసిస్టు ఎజెండా ప్ర‌మాదంపై లోతుగానే చ‌ర్చ‌ పెట్టారు. మోదీ నియంతృత్వాన్ని ఎదుర్కోవాలంటే అంద‌రూ చేయి చేయి క‌ల‌పాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది. అయితే.. సంఘ్‌ ప‌రివార్ అనుస‌రిస్తున్న మెజారిటీ వాద విధానాల‌ను మూలాల్లోంచి ప్ర‌తిఘ‌టించే పేరిట పండిత చ‌ర్చ‌ల్లోకి కుచించుకు పోవాల్సిన ప‌నిలేదనే వాద‌న‌లున్నాయి.

కాషాయీక‌ర‌ణ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో ద‌ళిత‌, ప్ర‌జాస్వామిక శ‌క్తులు తాత్విక‌, భావ‌జాల రంగంలో తీవ్రంగానే పోరాడుతున్నాయి. ఇంకా ఈ పోరాటాన్నీ మ‌రింత విస్తృతంగా కొన‌సాగించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉన్న‌ది. అలాగే.. మోదీ ఫాసిజాన్ని ఓడించ‌టానికి స‌ర‌ళ‌మైన విస్ప‌ష్ట రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ఉండాలి. మోదీ నియంతృత్వాన్ని నిలువ‌రించాలంటే.. మోదీ హ‌ఠావో-దేశ్ కో బ‌చావో లాంటి విస్ప‌ష్ట నినాదంతో ముందుకు పోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది

Updated On 21 Nov 2022 11:53 AM GMT
krs

krs

Next Story