- ఇప్పటికే ఒమిక్రాన్ ఉపరకాలు 500…
- జాగ్రత్తగా లేకపోతే… ప్రమాదమనే హెచ్చరిక
విధాత: చైనాలో విశ్వరూపం ప్రదర్శిస్తున్న కరోనా వైరస్‌తో ప్రపంచమంతా అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కొవిడ్-19 ఉపరకాలు ఇప్పటికే 500 ఉన్నాయని, ప్రపంచానికి మరిన్ని కరోనా వేవ్‌లు తప్పవని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించింది. కరోనా విషయంలో అలసత్వం వీడాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా బీఎఫ్-7 వేరియంట్ ప్రాణాంతకమైనది కాకపోయినా జాగ్రత్తలు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి వాన్ కెర్ఖోవ్ అన్నారు. చైనాలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వైరస్ విస్తరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలోనే భారత్ కూడా ఈ కరోనా వేరియంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం తగు చర్యలు తీసుకొంటున్నది. సమూహాలకు దూరంగా ఉండటం, మాస్కులు ధరించటం లాంటి జాగ్రత్తలతో వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సూచిస్తున్నది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ బీఎఫ్-7 రకం వైరస్ కేసులను ఇప్పటిదాకా ఇండియాలో మూడింటినే గుర్తించ గలిగారు. దీనికి అనుగుణంగా దేశ వ్యాప్తంగా వైద్యశాలలు తగు విధంగా సిద్దంగా ఉండాలని, దానికి మాక్‌డ్రిల్ కూడా నిర్వహించి సమాయత్తమవుతున్నారు.
డెల్టా మాదిరిగా ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోయినా ఈ ఒమిక్రాన్ రకాలను కూడా తేలికగా తీసుకొని ప్రమాదంలో పడవద్దని వైద్య ఆరోగ్య శాఖలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా సమూహాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.