Komatireddy | విధాత, హైద్రాబాద్: జాతీయ పార్టీలు బానిసత్వ పార్టీలంటూ కాంగ్రెస్‌ను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిశాకనే కవితా లిక్కర్ కేసు ఆగిపోయిందన్నారు. ఇన్నాళ్లు కేటీఆర్‌కు కొంత నాలేడ్జ్ ఉందనుకున్నానని, ఈ రోజు చిట్‌చాట్‌లో ఆయన మాటలు చూశాకా ఆయనకు ఏం తెలియదని అర్ధమైందన్నారు. రాజకీయాలపై […]

Komatireddy |

విధాత, హైద్రాబాద్: జాతీయ పార్టీలు బానిసత్వ పార్టీలంటూ కాంగ్రెస్‌ను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిశాకనే కవితా లిక్కర్ కేసు ఆగిపోయిందన్నారు. ఇన్నాళ్లు కేటీఆర్‌కు కొంత నాలేడ్జ్ ఉందనుకున్నానని, ఈ రోజు చిట్‌చాట్‌లో ఆయన మాటలు చూశాకా ఆయనకు ఏం తెలియదని అర్ధమైందన్నారు.

రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు. మేం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని, చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వక పోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టాడన్నారు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మేం తెలంగాణ కోసం కొట్లాడినామని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలన్నారు.

సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారని, సోనియా పాత్ర లేదని కేటీఆర్ అంటున్నాడ న్నారు. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చిందన్నారు. సోనియాగాంధీ పై కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కేటీఆర్ కి తగదన్నారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకపోయేదని, తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియాని ఎందుకు కలిశారు? ఎందుకు గ్రూప్ ఫోటో దిగారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఒక శాతమేనన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారని, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్ష్ ముఖ్యమంత్రులని ఎద్దేవా చేశారు. మా చెల్లిని అరెస్ట్ చేయకండని, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండని అమిత్‌షాకు కేటీఆర్ చెప్పి వచ్చాడన్నారు. మహమూద్ అలీ, పద్మ దేవేందర్ రెడ్డిలను బానిస లాగ చూసింది కేసీఆర్, బీఆరెస్ పార్టీ అన్నారు. మంత్రులకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా? దట్టిలు కట్టడానికి తప్పా మహమూద్ అలీ దేనికి పనికిరాడన్నారు. కేసీఆర్ కి దమ్ముంటే ముందు ఆయనను ఉద్యమ కాలంలో బండ బూతులు తిట్టిన దానం, తలసాని లను కేబినెట్ నుండి తీసేయాలన్నారు.

తెలంగాణ ద్రోహులను నీ పార్టీలో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావంటూ కేటీఆర్‌పై వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. కేబినెట్ మంత్రుల్లో చాలా మంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వారేనని, దానం నాగేందర్ కట్టే పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడని, అరేయ్ కేసీఆర్ ఫుట్ బాల్ లాగా తంతాను అన్న తలసాని మంత్రి ఎలా అయ్యాడు? అని ప్రశ్నించారు. మీ తండ్రిని ఫుట్ బాల్ అడుతానని తిట్టినా వాళ్ళని కేబినెట్లో పెట్టుకోవడానికి సిగ్గులేదా? అంటూ కేటీఆర్‌ ను ప్రశ్నించారు. కేసీఆర్ ఏనాడైనా పార్లమెంటులో తెలంగాణ గురించి మాట్లాడారా అని నిలదీశారు.

ఎన్నికలు వస్తున్నాయనే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారని, కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చి పంపారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఒకటవ తారీఖున పింఛన్లు వచ్చేవని, బీఆరెస్ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిందో చెప్పాలన్నారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్ ఏమయిందన్నారు. దళిత బంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నామన్నారు.

Updated On 12 Sep 2023 2:07 PM GMT
krs

krs

Next Story