విధాత, హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వచ్చాకే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అంటే.. లేదు మా హయంలో అభివృద్ధి సాగిందంటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పరస్పరం మాటల యుద్ధానికి దిగిన వైనం టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వేడిపుట్టించింది.
శనివారం మేళ్లచెరువు ప్రాథమిక సహకార సంఘం నూతన గోదాంల ప్రారంభోత్సవ సభలో నియోజక వర్గంలో టీఆర్ఎస్ గెలుపుతో ఎమ్మెల్యేగా తాను పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రైతులకు సాగునీటి వనరుల అభివృద్ధి పనులు జరిపించామని ఎమ్మెల్యే సైదిరెడ్డి రెడ్డి అన్నారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో నియోజకవర్గంలో తన హయాంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, రైతుల సంక్షేమానికి సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు జరిపించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చేయడం లేదన్నారు.
దీంతో ఉత్తమ్ ప్రసంగానికి టీఆర్ఎస్ నాయకులు అడ్డుపడగా, తాము కూడా హంగామా చేయగలమంటూ ఉత్తమ్ ప్రతిస్పందించడంతో సైదిరెడ్డి.. ఉత్తమ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటు రెండు పార్టీల శ్రేణులు సైతం వాగ్వివాదానికి దిగి పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.